రాయలసీమ న్యూస్, డివోషనల్ డెస్క్: హిందూ పురాణాల్లో ఏకాదశి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఈ తిథిని అన్ని ఏకాదశుల్లో అత్యంత గొప్పదిగా పండితులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఏకాదశి రోజున భక్తులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఆచరిస్తారు. అయితే నిర్జల ఏకాదశి రోజున మాత్రం నీరు సహా ఏ ఆహార పదార్థాన్నీ తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉండడం శాస్త్రోక్తం. ఈ కారణంగానే ఇది అత్యంత కష్టతరమైన ఏకాదశి వ్రతంగా పురాణాల్లో వర్ణించబడింది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణాలు తెలియజేస్తున్నాయి. కలియుగంలో మాత్రమే కాకుండా, త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా ప్రజలతో పాటు స్వయంగా దేవతలు ఈ వ్రతాన్ని పాటించారని పండితులు వివరిస్తున్నారు.
మత గ్రంథాల ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం ఆచరించాలి. మహాభారతంలో వేదవ్యాసుడు ఈ వ్రత మహిమను వివరించినట్లు పండితులు చెబుతున్నారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించిన వారికి ఏకంగా 24 ఏకాదశుల ఫలితం లభిస్తుందని గ్రంథాల్లో పేర్కొన్నట్లు వారు వివరిస్తున్నారు.
ఈ ఏడాది జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి జూన్ 24 సాయంత్రం 6.12 గంటలకు ప్రారంభమై, జూన్ 25 రాత్రి 8.09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా తీసుకునే శాస్త్ర నియమం ప్రకారం, ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 25, 2026న ఆచరించాలి. ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి కటాక్షం, గృహంలో సిరిసంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉపవాసానికి సంకల్పం చేయాలి. అనంతరం శ్రీమహావిష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలు, తులసి మాలలతో అలంకరించి, పండ్లు, పుష్పాలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్కకు ప్రత్యేక పూజ చేసి, నెయ్యి దీపం వెలిగించి, 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. నిర్జల ఏకాదశి కథను చదివి హారతి ఇవ్వడం శాస్త్రోక్తం.
ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపిస్తూ, విష్ణుమూర్తిని స్మరించుకుంటూ గడపాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాస సమయంలో రాత్రి నిద్రపోకుండా, భజనలు, కీర్తనలతో జాగరణ చేయడం శ్రేయస్కరం అని గ్రంథాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య కారణాల వల్ల పూర్తిగా నిర్జలంగా ఉండలేని వారు, నీరు, పండ్లతో ఉపవాసం కొనసాగించవచ్చని శాస్త్రం పేర్కొంటుంది.
ఈ ఉపవాసాన్ని మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, పూజలు చేసి, అనంతరం ఆహారం తీసుకోవడం ద్వారా విరమించాలి. నిష్ఠ, భక్తితో నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తులపై శ్రీమహావిష్ణువు కటాక్షం కురిపించి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తున్నారు.
పై వివరాలు పురాణాలు, పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్లో లభ్యమయ్యే సమాచారాన్ని ఆధారంగా సమీకరించబడినవి. ఆచరణకు ముందు వ్యక్తిగత ఆధ్యాత్మిక గురువులను, నిపుణులను సంప్రదించడం ఉత్తమం.







