రాయలసీమ న్యూస్, కర్నూలు:
కర్నూలు నియోజకవర్గంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్నూలు అసెంబ్లీ ఓటరు నమోదు అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
గురువారం స్థానిక SBI Employees కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల అమలు విధానంపై చర్చించారు.
ఈఆర్వో చల్లా ఓబులేసు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు, అనర్హుల పేర్ల తొలగింపు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు Form-6, ఓటరు జాబితాలో అనర్హుల పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాల కోసం Form-7, ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలు లేదా నివాస మార్పు కోసం Form-8ను వినియోగించుకోవచ్చని చల్లా ఓబులేసు తెలిపారు.
ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించే ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్ధారించుకునేలా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని, అవసరమైన క్లెయిమ్లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఈఆర్వో చల్లా ఓబులేసు కోరారు.
సమావేశంలో AEROలు, అడిషనల్ కమీషనర్ RGVI కృష్ణ , డిప్యూటీ కమీషనర్ సతీష్ కుమార్ , డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.







