రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి: జేసీ డా. నిధి మీనా
కడప : యోగా సాధన ద్వారా సమస్త మానవాళికి ఆరోగ్య యోగం సిద్ధిస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా ను భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పిలుపునిచ్చారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్టలో 12వ ప్రపంచ యోగా దినోత్సవ పక్షోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉత్సాహవంతంగా జరిగింది. ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన హాజరయ్యారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయుష్ సిబ్బంది, యోగా శిక్షకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగా పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. యోగాంధ్ర క్యాంపెన్ -2026 లో భాగంగా జూన్ 7 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న ఈ పక్షోత్సవాల ద్వారా యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తూ, యోగా పై అవగాహన పెంపొందించనున్నట్టు వివరించారు. జిల్లా యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని ఆమె కోరారు. ప్రాచీన కాలం నుండి మునులు, ఋషులు, యోగులు తపోనిష్ఠతో యోగాసనాలు, ప్రాణాయామాలు ఆచరించి అనారోగ్యాలను దరిచేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు. మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నివారణలో యోగా మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన మాట్లాడుతూ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చదువులు, గృహకార్యాలు, కార్యాలయ ఒత్తిళ్ల కారణంగా అనేక మంది శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటన్నింటినీ జయించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సులభమైన ఆరోగ్య సూత్రం యోగా మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం, యోగా, ధ్యానం కోసం కేటాయించాలని ప్రజలను కోరారు.
కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన స్వయంగా యోగాసనాలు ప్రదర్శించి పాల్గొన్న వారిలో ఉత్సాహం నింపారు. వీరితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా యోగాసనాలు ఆచరించారు. యోగామాస్టర్ లు నిర్ణయించిన ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో ప్రశాంతి, కేఎంసి అదనపు కమిషనర్ రాజేష్ చంద్రం, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, డిఎంహెచ్ఓ డా. నాగరాజు, జిఎస్డబ్ల్యూ జిల్లా అధికారి మైథిలీ, జిల్లా అధికారులు, ఆయుష్ సిబ్బంది, యోగా శిక్షకులు ప్రసాద్ బృందం, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.







