రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్: డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం సర్వీస్ రూల్స్‌లో ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ మార్పులతో ఆ పోస్టు వర్గీకరణ, నియామక విధానం, విద్యార్హతలు, వయోపరిమితి, ప్రమోషన్‌కు అవసరమైన సర్వీస్ అర్హతలు స్పష్టంగా నిర్ధారించబడ్డాయి.
ప్రభుత్వం తాజా నిర్ణయాల ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ పోస్టును కేటగిరీ–4గా చేర్చారు. ఈ కేటగిరీ–4లో సాధారణ డిప్యూటీ తహసీల్దార్ పోస్టుతో పాటు స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ , డిప్యూటీ తహసీల్దార్ (Resurvey) పోస్టులు కూడా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేశారు.
డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు నియామకం రెండు మార్గాల ద్వారా జరగనుంది. మొదటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, రెండోది రెవిన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా. ఈ రెండు మార్గాలకూ వేర్వేరు అర్హతలను ప్రభుత్వం నిర్దేశించింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన వారు కావాలి. డిగ్రీ విద్యార్హతను తప్పనిసరి అర్హతగా సర్వీస్ రూల్స్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి విషయంలో కూడా స్పష్టమైన నిబంధనను అమలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించి విడుదలయ్యే నోటిఫికేషన్ ఉన్న సంవత్సరంలో జూలై 1 నాటికి అభ్యర్థి వయస్సు 34 సంవత్సరాలు పూర్తి అయి ఉండకూడదు. ఈ పరిమితిని మించి ఉన్న వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉండదు.
ప్రమోషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు వెళ్లాలనుకునే రెవిన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ లకు కనీసం 4 సంవత్సరాల సర్వీస్ తప్పనిసరి అర్హతగా నిర్ణయించారు. ఆ 4 సంవత్సరాల సర్వీస్‌లో కనీసం 2 సంవత్సరాలు రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉండాలి. ఈ విధంగా ఫీల్డ్ స్థాయి అనుభవం ఉన్నవారికి మాత్రమే ప్రమోషన్ అవకాశం కల్పించేలా నిబంధనలను రూపొందించారు.
అదనంగా స్పెషల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వారికి సర్వీస్ లెక్కింపులో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. స్పెషల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా 6 నెలల సర్వీస్‌ను సాధారణ రెవిన్యూ ఇన్స్పెక్టర్గా 2 సంవత్సరాల సర్వీస్‌గా పరిగణించే అవకాశం సర్వీస్ రూల్స్‌లో చేర్చారు. దీంతో స్పెషల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేసిన ఉద్యోగులు ప్రమోషన్ అర్హతలను త్వరగా సాధించే అవకాశం పొందనున్నారు.
ఈ మార్పులతో డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ మరింత స్పష్టతతో అమల్లోకి రావడంతో, నియామకాలు, ప్రమోషన్ల ప్రక్రియలో ఏకరీతి నెలకొనే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.






