రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: అక్కినేని కుటుంబం, అభిమానులంతా ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విజయోత్సవ సభ (సక్సెస్‌మీట్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య, అఖిల్ ఎంపిక చేసిన పాత్ర, అతని కృషి గురించి మాట్లాడారు.
తాను ‘లెనిన్’ కథ విన్నప్పుడు నటుడిగా భయపడినట్లు నాగచైతన్య వెల్లడించారు. ఇలాంటి పాత్ర పోషించాలంటే మంచి అనుభవం, పలు సినిమాల్లో నటించిన తర్వాతే సాధారణంగా నటులు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అఖిల్ మాత్రం కథపై నమ్మకం ఉంచి, సవాల్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని అంగీకరించాడని ఆయన పేర్కొన్నారు.
‘‘లెనిన్ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథను అంగీకరించినప్పుడే అఖిల్ నా దృష్టిలో హీరో అయ్యాడు. ఈ కథ వినగానే ఒక నటుడిగా నాకు భయం వేసింది. ఇలాంటి పాత్ర చేయాలంటే కనీసం 25 సినిమాలు చేసిన అనుభవం ఉండాలి. కానీ, అఖిల్ కథను నమ్మి దీన్ని అంగీకరించాడు. రియల్ లైఫ్‌లో తన క్యారెక్టర్‌కు ఈ సినిమాలో పాత్రకు సంబంధమే లేదు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని నాగచైతన్య అన్నారు.
ఈ సందర్భంగా ఆయన అక్కినేని నాగార్జున గురించి కూడా మాట్లాడారు. ఇంట్లో నాగార్జున ఎలా ఉంటారో, ఆయన స్వభావం, పనితీరు గురించి తాను, అఖిల్‌కే బాగా తెలుసని చెప్పారు. ఏ పనినైనా సవాల్‌గా తీసుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి ఆయన ఎంతదూరమైనా వెళ్తారని నాగచైతన్య వ్యాఖ్యానించారు.
‘‘నాన్న ఇంట్లో ఎలా ఉంటారనేది నాకు, అఖిల్‌కే తెలుసు. దేనినైనా సవాలుగా తీసుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తారు. ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాల సమయంలో ఆయనలో ఆ తపన చూశా.. మళ్లీ ఇప్పుడు ‘లెనిన్’ టైమ్‌లో చూశాను. ఈ సినిమా కథ గురించి చెప్పగానే.. లవ్‌స్టోరీలు వస్తోన్న సమయంలో ఇలాంటి కథను ఆదరిస్తారా అని అడిగా.. ‘నేను చేసి చూపిస్తా’ అన్నారు. ఆయనలో నాకు నచ్చేది ఆ ధైర్యమే. ఆయనే నాకు స్ఫూర్తి’’ అని నాగచైతన్య పేర్కొన్నారు.
‘లెనిన్’ విజయంతో అఖిల్ కెరీర్‌లో కొత్త మలుపు తిరిగిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అభిమానుల ఆదరణతో ఈ చిత్రం మరింత ముందుకు సాగుతుందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.







