యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న రూరల్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ విడుదల మరోసారి వాయిదా పడనుందనే సమాచారం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కింగ్ నాగార్జున స్వయంగా ఈ సినిమా ఫస్ట్ కట్ చూసి, థియేటర్లలో ఈసారి సరికొత్త అఖిల్‌ను చూడబోతున్నామని యూనిట్ వర్గాలకు ధైర్యం చెప్పినట్టు తెలిసింది.

అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, పాటలు సోషల్ మీడియాలో మంచి హైప్‌ను సృష్టించాయి. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా జూలైకి మారినట్టు ఫిలిం నగర్ టాక్. చిత్ర బృందం దృష్టిలో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చిందనే నమ్మకం ఉన్నప్పటికీ, ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అఖిల్ భావిస్తున్నారని సమాచారం.

విజువల్ ఎఫెక్ట్స్, ఫైనల్ ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, ప్రేక్షకులకు అత్యుత్తమ నాణ్యతతో సినిమా అందించాలని హీరో పట్టుదలగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 26 రిలీజ్ డేట్‌ను మార్చాలని అఖిల్ సూచించడంతో, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, నాగార్జున అక్కినేని కూడా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘లెనిన్’ వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. మొదట ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లకు రానుండటంతో, బాక్సాఫీస్ వద్ద అనవసర క్లాష్ తప్పించుకోవాలనే ఉద్దేశంతో ‘లెనిన్’ను జూన్ 26కి మార్చినట్టు నిర్మాతలు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ‘పెద్ది’ కూడా వాయిదా పడినా, ‘లెనిన్’ మాత్రం జూన్ 26నే ఫిక్స్ చేసుకుంది.

ఇప్పుడు తాజా పరిస్థితుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల నాణ్యత దృష్ట్యా జూన్ 26నుంచి తప్పుకుని, జూలై 10 లేదా జూలై మధ్యలో ఏదో ఒక తేదీని లక్ష్యంగా పెట్టుకుని విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వాయిదా వార్తతో అక్కినేని అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్వాలిటీ కోసం ఆలస్యమైనా పరవాలేదని, అఖిల్ ఈసారి ఘన విజయంతో కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

ఇక జూలై నెలకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందని ట్రేడ్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ‘ఇంద్ర’, ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలన్నీ జూలైలోనే విడుదలై రికార్డులు సృష్టించాయి. అందుకే ‘లెనిన్’ జూలై రిలీజ్‌ను కూడా సానుకూలంగా చూస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పవర్‌ఫుల్ విలేజ్ డ్రామా అఖిల్ కెరీర్‌లోనే పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

జూన్ లాస్ట్ వీక్ స్లాట్ ఖాళీ కావడంతో ఆ తేదీకి ఏ సినిమా వస్తుందనే ఆసక్తి పెరిగింది. మరోవైపు, ‘లెనిన్’ కొత్త అధికారిక రిలీజ్ డేట్ కోసం అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.