రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో సాంగ్
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి ప్రత్యేక వీడియో సాంగ్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను చిత్రబృందం విడుదల చేసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంతో రూపొందుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో సాంగ్ ప్రమోషన్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లింది.
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా, ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియోను ముందుగా థియేటర్లలో ప్రదర్శించారు. అనంతరం అధికారికంగా సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్‌తో పోలిస్తే, ఈ వీడియో సాంగ్ మరింత మాస్, వైలెంట్ యాంగిల్‌ను చూపిస్తూ ప్రత్యేకంగా నిలిచింది.
ఈ వీడియోలో అఖిల్ పాత్రను పూర్తిగా మాస్ లుక్‌లో చూపించారు. అతని పాత్రలోని హింసాత్మక కోణాన్ని, ప్రేమ కోసం చేసే పోరాటాన్ని సమాంతరంగా ఆవిష్కరించారు. భాగ్యశ్రీతో అఖిల్ లవ్ స్టోరీని, ఆమె కోసం అందరినీ ఎదురించి నిలబడే సన్నివేశాలను చూపించారు. బస్‌లో భాగ్యశ్రీని రౌడీ మూకలు వేధిస్తుంటే, అఖిల్ వెళ్లి వారితో పోరాడే సన్నివేశం, వందలాది రౌడీలు అతడిపైకి దూసుకొస్తుండగా, అఖిల్ ఒక్కడే తన పెట్ డాగ్‌తో కలిసి వారిపై యుద్ధానికి దిగే షాట్లు వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఇవి సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌కు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ఈ వీడియోపై ‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్‌ను ఉంచి, ప్రేమ కోసం లెనిన్ ఎంతటి హింసకు దిగిపోతాడో ఒక శాంపిల్‌గా చూపించారు. చివర్లో వేట కొడవలితో ఊచకోత కోసే షాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజువల్స్ చూసి అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు.
‘సోల్ ఆఫ్ లెనిన్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్ బమ్స్ తెప్పించేలా ఉందని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. మురళీ కిషోర్ పిక్చరైజేషన్, దానికి తగ్గట్టుగా డీఓపీ లియోన్ బ్రిట్టో అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అఖిల్, భాగ్యశ్రీ జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తం మీద అభిమానులు ఊహించని విధంగా ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో సాంగ్ ఉండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చాన్నాళ్లుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.







