రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘రాకా’లో అల్లు అర్జున్ నాలుగు గెటప్‌లు?
అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఆతృత
అగ్ర నటుడు అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న భారతీయ ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఇదీ ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారనే సమాచారం ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ‘రాకా’లో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నాలుగు భిన్నమైన పాత్రల్లో నటించనున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే, ఇది అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో తొలి మల్టిపుల్ రోల్ చిత్రం కానుంది. ఇప్పటివరకు ఆయన ఇంతకు మించిన బహుళ పాత్రల ప్రయోగం చేయలేదు కాబట్టి, ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినప్పుడు అట్లీ కేవలం డబుల్ రోల్‌కే పరిమితం చేయాలనుకున్నారని, తండ్రి, తాత పాత్రలకు వేరే నటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే తర్వాత దశలో అల్లు అర్జున్ స్వయంగా ముందుకు వచ్చి నాలుగు పాత్రలన్నీ తానే పోషిస్తానని ఆసక్తి చూపినట్లు టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఈ ప్రతిపాదనపై అట్లీకి సందేహం ఉన్నప్పటికీ, లుక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ గెటప్‌లు, నటన చూసి ఇది సినిమాకు ప్లస్ అవుతుందని భావించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అల్లు అర్జున్ నాలుగు పాత్రల వార్తపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందుకే ఈ అంశంపై స్పష్టత కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
‘రాకా’లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. గ్లోబల్ స్థాయిలో ఇంతకుముందెన్నడూ చూడని విజువల్స్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు అట్లీ ముందుగా హామీ ఇచ్చారు. భారీ సాంకేతిక బృందం, విస్తృత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
2027లో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం, కథా నిర్మాణం, పాత్రల వైవిధ్యం, సాంకేతిక నాణ్యతలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.







