బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన పేర్కొనడం అభిమానుల్లో ఆందోళనకు దారితీసింది.

అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చే వరకు జరిగిన ప్రక్రియను వివరించారు. శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో గడిపిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఏ కారణంతో శస్త్రచికిత్స జరిగింది, ఏ విధమైన చికిత్స చేయించుకున్నారు అనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో శస్త్రచికిత్స, ఐసీయూ, ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి రావడం జరిగింది. శారీరకంగా, మానసికంగా కొలుకునే ఈ దశ అత్యంత కష్టతరమైనది.

ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే విజయాలు, అపజయాలపై కూడా అమితాబ్ బచ్చన్ తన ఆలోచనలను బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రతి విజేత కూడా ఒక రోజు ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ధైర్యంగా ముందుకు సాగే వారే నిజమైన ఛాంపియన్లు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. గత విజయాల జ్ఞాపకాలకే పరిమితమైపోకుండా, కొత్త సవాళ్లను స్వీకరించాలని సూచించారు.

ఏ మార్గమూ తప్పు కాదు. బాగుండండి… సంతోషంగా ఉండండి… అంతే.

తన సందేశాన్ని ఈ మాటలతో ముగించిన అమితాబ్ బచ్చన్, అభిమానులకు ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఈ బ్లాగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమితాబ్ బచ్చన్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికలపై పోస్ట్‌లు చేస్తూ ఆకాంక్షిస్తున్నారు.

83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ సినిమాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘Kalki 2898 AD’ సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.