రివ్యూ ‘అతిరథి’ : కాలేజీ ఎంటర్‌టైనర్‌

ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన బాసిల్ జోసెఫ్, టొవినో థామస్, రియా షిబు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం ‘అతిరథి’ ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం గత నెల థియేటర్లలో విడుదలై మోస్తరు స్థాయిలో ఆకట్టుకుంది. ప్రస్తుతం సోనీ లివ్ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యే తుంటరి కుర్రాడు శామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్) కథ ఇది. ఈ కాలేజీలో రెండేళ్ల క్రితం జరిగిన విషాద ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతి ఏడాది జరిగే ‘ఆరోహన్’ అనే ఫెస్ట్‌ను నిర్వాహకులు నిలిపివేస్తారు. ఆగిపోయిన ఆ ఫెస్ట్‌ను మళ్లీ నిర్వహించాలనే పట్టుదలతో శామ్ ముందుకు వస్తాడు. ఈ ఫెస్ట్‌ను తప్పనిసరిగా జరిపించాలనే అతని పట్టుదల వెనక ఒక వ్యక్తిగత కారణం ఉంటుంది.

ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్‌ వరకు శామ్ తన స్నేహితులు, కాలేజీ మేనేజ్‌మెంట్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరకు అందరినీ కన్విన్స్ చేసి ఫెస్ట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తాడు. ఇంతలో కాలేజీకి మాజీ రౌడీ, ప్రస్తుతం సింగర్ కావాలనుకునే తోట కుట్టన్ (టొవినో థామస్) ఎంట్రీతో కథలో మలుపు వస్తుంది. శామ్, కుట్టన్ మధ్య ఏం గొడవ జరుగుతుంది? శామ్ ప్రేమించే స్వాతి (రియా షిబు)తో అతని ప్రేమకథ ఎటువంటి మలుపులు తిరుగుతుంది? చివరికి ‘ఆరోహన్’ ఫెస్ట్ జరుగుతుందా లేదా అనేదే మిగతా కథ.

కథ పరంగా చూస్తే, ఇంజినీరింగ్ కాలేజీలో ఆగిపోయిన ఫెస్ట్‌ను తిరిగి జరిపించేందుకు హీరో చేసే ప్రయత్నాలే ప్రధాన సారం. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, టీమ్ రెండున్నర గంటల నిడివి ఉన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా మేనేజ్ చేసిన తీరు ఓ మోతాదులో ఆకట్టుకుంటుంది. అయితే మొదటి భాగం ఎక్కువగా సన్నివేశాల పరంపరలా సాగిపోవడంతో కొంత బోరింగ్‌గా అనిపించే సందర్భాలు ఉంటాయి.

ఇంటర్వెల్‌కు ముందు కుట్టన్ పాత్ర ప్రవేశించే వరకు కథకు పెద్దగా జోష్ ఉండదు. కుట్టన్ ఎంట్రీ తర్వాత శామ్, కుట్టన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ స్టైల్‌లో సాగే ఘర్షణ, సరదా ఎపిసోడ్లు సినిమాకు ఊపు తెస్తాయి. ఫైట్లు ఉన్నాయన్న పేరుకే, అవి ఎక్కువగా హాస్యభరితంగా, లైట్ టోన్‌లో సాగుతాయి. మలయాళ చిత్రాలకు ప్రత్యేకమైన నెమ్మదైన నడక, కొన్ని చోట్ల సాగదీత ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌కు దగ్గర్లో కొద్దిగా ఎమోషన్ జోడించి కథను ముగించిన తీరు సగటు స్థాయిలోనైనా కన్విన్స్ చేస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే, శామ్ కుట్టి పాత్రలో బాసిల్ జోసెఫ్ సహజంగా నటించాడు. కాలేజీ కుర్రాడి తుంటరి నడవడిక, సీరియస్ మోమెంట్స్ రెండింటినీ బాగా మిళితం చేశాడు. మాజీ రౌడీగా, సింగర్ కావాలనుకునే కుట్టన్ పాత్రలో టొవినో థామస్ కూడా ఎంటర్‌టైన్ చేశాడు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలం. కిడ్నాప్ అయి ఇబ్బందులు పడే వినీత్ శ్రీనివాసన్ పాత్ర కూడా బాగానే నిలిచింది. ‘సర్వం మాయ’ ఫేమ్ రియా షిబు పోషించిన స్వాతి పాత్రకు మాత్రం పెద్దగా స్కోప్ లేకపోవడం గమనార్హం. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా చూస్తే, కథలో పెద్దగా బలం లేకపోయినా, స్క్రీన్‌ప్లే, ట్రీట్‌మెంట్‌తో టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించగలిగారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి తగ్గట్టుగానే ఉంది. సినిమాటోగ్రఫీ కాలేజీ వాతావరణాన్ని, ఫెస్ట్ సన్నివేశాలను చక్కగా చూపించింది. దర్శకత్వం పరంగా ఫస్ట్ హాఫ్‌లో మరికొన్ని బలమైన కామెడీ సీన్లు ఉంటే ఇంకా బాగుండేదనే భావన కలుగుతుంది. తెలుగు డబ్బింగ్ సహజంగా, ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది.

కుటుంబంతో కలిసి చూడదగ్గ, అభ్యంతరకర సన్నివేశాలు లేని కాలేజీ బ్యాక్‌డ్రాప్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ‘అతిరథి’ ఓ సగటు స్థాయి టైమ్ పాస్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

రేటింగ్:- 2.5/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) స్ట్రీమింగ్ ఇన్ sonyliv