రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రభాస్ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన రెండు భాగాల మహాకావ్య చిత్రం ‘బాహుబలి’ సాధించిన విజయానికి దేశాలు, భాషలు అడ్డుకాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి లభించిన ఆదరణతో ‘బాహుబలి’ ఫ్రాంఛైజీకి విశేషమైన అభిమాన వర్గం ఏర్పడింది. అదే క్రేజ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై కనిపిస్తోంది.
‘బాహుబలి’ ఫ్రాంఛైజీ కొనసాగింపులో భాగంగా రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రతిష్ఠాత్మక అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రం ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఫ్రాన్స్‌లోని అన్నెసీ నగరంలో ఈ నెల చివరి వారంలో జరగనున్న ఈ చిత్రోత్సవానికి సంబంధించిన బుకింగ్స్‌ను నిర్వాహకులు ఇటీవల ప్రారంభించారు. అందులో భాగంగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రత్యేక ప్రదర్శన టికెట్లు అమ్మకానికి పెట్టగానే కేవలం రెండే నిమిషాల్లో అన్నీ సేల్ అవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాల్లో ‘బాహుబలి’ ఫ్రాంఛైజీపై ఉన్న ఆసక్తి, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ స్పందన స్పష్టంగా తెలియజేస్తోంది.
అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించే అవకాశమున్న యానిమేషన్ చిత్రాలను ఈ విభాగంలో ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. గతంలో ‘స్పైడర్‌మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వర్స్’, ఆస్కార్ ఉత్తమ యానిమేషన్ చిత్రంగా నిలిచిన ‘ఫ్లో’ వంటి చిత్రాలు కూడా ఇదే విభాగంలో ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకోవడం భారత యానిమేషన్ రంగానికి గర్వకారణంగా భావిస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ చిత్రానికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. విజువల్ ప్రెజెంటేషన్, పాత్రల రూపకల్పన, నేపథ్య సంగీతం టీజర్‌లో ఆకట్టుకోవడంతో పూర్తి చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
వచ్చే ఏడాదిలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ కథా ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో కొత్తగా ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మార్కెట్ సాధించే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







