‘కాక్‌టైల్ 2’ రివ్యూ: క్రేజీ లవ్ ట్రయాంగిల్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్

బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రొమాంటిక్ డ్రామా ‘కాక్‌టైల్’ గుర్తుండే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొనే, డయానా పెంటీ తెరపై పండించిన ఎమోషన్స్ అప్పట్లో థియేటర్లలో మ్యాజిక్ చేశాయి. అదే టైటిల్‌తో, మళ్లీ లవ్, ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘కాక్‌టైల్ 2’. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) పెళ్లి బంధంపై నమ్మకం లేకుండా, దాదాపు దశాబ్ద కాలంగా లివ్-ఇన్ రిలేషన్‌లో బిందాస్‌గా జీవిస్తుంటారు. అయితే సొసైటీ, కుటుంబ సభ్యుల ఒత్తిడిని తట్టుకోలేక కొంత రిలాక్స్ కావాలనే ఉద్దేశంతో సిసిలీకి వెళ్తారు. అక్కడ దియా కాలేజ్ ఫ్రెండ్ అలీ (కృతి సనన్) ఎంట్రీ ఇస్తుంది. కేర్‌ఫ్రీ లైఫ్‌స్టైల్‌తో ఉండే అలీని చూసి దియా, కునాల్‌పై తనకున్న నమ్మకాన్ని పరీక్షించాలనుకుంటుంది.

కునాల్ కట్టుబాటుపై అనుమానం వచ్చిన దియా, అలీకి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తుంది. ఫన్ కోసం మొదలైన ఆ టెస్ట్ క్రమంగా సీరియస్ మలుపు తీసుకుంటుంది. అలీ నిజంగానే కునాల్‌తో ప్రేమలో పడిపోతుంది. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టే సమయంలో ఈ లవ్ ట్రయాంగిల్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ గందరగోళం నుంచి కునాల్ ఎలా బయటపడ్డాడు? అన్నదే మిగతా కథ.

టెక్నికల్‌గా చూస్తే సినిమా విజువల్స్ చాలా గ్రాండ్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాయి. సిసిలీ అందాలు, అందమైన లొకేషన్స్, సూపర్ హిట్ సాంగ్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. లవ్ రంజన్ అందించిన కథలో యూత్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మాత్రం కొన్ని చోట్ల ల్యాగ్ అయిన భావన కలిగిస్తుంది. దాదాపు 150 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్, రొమాన్స్, ఫన్‌తో సాగిపోతే, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి.

ఎమోషనల్ బీట్‌లు మరింత బలంగా ఉండి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ ‘కాక్‌టైల్’లో కనిపించిన ఇంతియాజ్ అలీ మార్క్ డెప్త్ ఈ సారి కొంత మిస్సయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మోడరన్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ప్రస్తుతం మిశ్రమ స్పందనను అందుకుంటోంది.

నటీనటుల పరంగా చూస్తే సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టిందని చెప్పదగ్గది కృతి సనన్ నటన. అలీ పాత్రలో ఆమె ఎనర్జీ, గ్లామర్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. షాహిద్ కపూర్ తన అనుభవంతో కునాల్ పాత్రను సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా పోషించాడు. రష్మిక మందన్న ఎమోషనల్ సీన్లలో మంచి ప్రదర్శన కనబరిచింది.

అయితే రష్మిక హిందీ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆమె సౌత్ ఇండియన్ యాస స్పష్టంగా వినిపించడం బాలీవుడ్ ప్రేక్షకులందరికీ నచ్చలేదని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు సినిమా చాలా బాగుందని, షాహిద్–కృతి నటన అదిరిపోయిందని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించిందని, సినిమా అంతా మెరుపులే కానీ మ్యాటర్ తక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. లవ్ రంజన్ కథ రొటీన్‌గా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద ‘కాక్‌టైల్ 2’ విజువల్‌గా చాలా బాగుంది, నటీనటుల ప్రదర్శనలు మెప్పిస్తాయి. కానీ లవ్ స్టోరీకి కావాల్సిన కథా బలం మాత్రం కొరవడినట్లు అనిపిస్తుంది. వీకెండ్‌లో గ్లామర్, అందమైన లొకేషన్స్, లైట్ హార్టెడ్ డ్రామా మాత్రమే కావాలనుకునే ప్రేక్షకులు ఒకసారి చూసేయొచ్చనే మాట వినిపిస్తోంది.

రేటింగ్:- 2.5/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)