రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ తన బృందంతో కలిసి విశాఖపట్నం సమీపంలోని తగరపువలసలో జరిగిన జాతరకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి వారు కారులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, కారులో ఉన్న వ్యక్తుల్లో ఒకరికి అకస్మాత్తుగా వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు.
ఆ సమయంలో పండు మాస్టర్ కూడా కారు దిగుతుండగా, వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారు, ఆయనను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వ్యాన్ ఢీకొట్టిన వేగానికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారు మాత్రమే కాకుండా, ఆ కారుకు ముందు రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
తీవ్ర గాయాలపాలైన పండు మాస్టర్‌ను స్థానికులు, ఆయనతో ఉన్న సహచరులు కలిసి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదానికి కారణమైన కోళ్ల వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అధిక వేగంతో వాహనం నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా పండు మాస్టర్‌కు మంచి అభిమాన వర్గం ఏర్పడింది. ఆయన ప్రమాదంలో గాయపడ్డారన్న వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సహచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆకాంక్షిస్తున్నారు.







