రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపిక కావడం తమిళ సినీ పరిశ్రమలో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇటీవల ప్రశంసలు అందుకున్న ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి చిత్రాలకు అవార్డు దక్కకపోవడంపై సినీ అభిమానులు, విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన నటుడు ధనుష్, ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని హుందాగా వెల్లడించారు.
జాతీయ అవార్డులపై వస్తున్న విమర్శలను తాను తప్పుగా భావించడం లేదని ధనుష్ తెలిపారు. ‘మెయ్యళగన్’, ‘మహారాజా’ వంటి చిత్రాలు కూడా జాతీయ అవారార్డుకు పూర్తిగా అర్హమైనవేనని ఆయన అంగీకరించారు. మంచి సినిమాలు ఎన్నో పోటీలో ఉన్నప్పుడు భిన్నమైన అభిప్రాయాలు రావడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు.
తన కెరీర్ను గుర్తు చేసుకున్న ధనుష్, ‘పుదుపేట్టై’, ‘మర్యాన్’, ‘కర్ణన్’, ‘రాంఝానా’, ‘వడ చెన్నై’ వంటి తన కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాలకు జాతీయ అవార్డు గుర్తింపు రాలేదని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆ చిత్రాల కోసం పెద్దగా ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం ఒక్క అవార్డు విషయంలో పెద్ద చర్చ జరగడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
సినిమా విలువను కేవలం అవార్డులతో మాత్రమే కొలవలేమని ధనుష్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల ప్రేమ, చిరస్థాయిగా నిలిచిపోయే గుర్తింపే ఒక సినిమాకి అసలైన విజయమని ఆయన స్పష్టం చేశారు. అవార్డు లభించకపోయినా, మంచి సినిమాలు కాలానుగుణంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ చెప్పిన ఒక మాటను ధనుష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ మాట తన జీవితంలో కూడా నమ్మే సిద్ధాంతమని ఆయన వెల్లడించారు.
“మీరు మీ ఓటమిని అంగీకరించే వరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు”
తమిళ సినీ పరిశ్రమలో అవార్డుల చుట్టూ జరుగుతున్న చర్చల కంటే, మొత్తం తమిళ సినిమా సాధించిన విజయాలను అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని ధనుష్ పిలుపునిచ్చారు. విభేదాలను పెంచడం కంటే మంచి సినిమాలను ప్రోత్సహించడం, కళాకారుల కృషిని గౌరవించడం ముఖ్యమని ఆయన సందేశం ఇచ్చారు.
ధనుష్ చేసిన ఈ హుందా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అభిమానులు, సినీ వర్గాలు ఆయన సమతుల్య స్పందనను ప్రశంసిస్తున్నట్లు కనిపిస్తోంది.







