సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అప్పుడప్పుడూ నటుడిగా కూడా తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్‌’ ఇటీవల తమిళంలో విడుదలై, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్‌ కథతో పాటు ఫాంటసీ అంశాలు కలగలిపిన ఈ థ్రిల్లర్‌ ఎంతవరకు థ్రిల్‌ పంచిందో చూద్దాం.

కథలోకి వెళ్తే.. మహి (జీవీ ప్రకాశ్‌ కుమార్‌) హైదరాబాద్‌లోని తన మామయ్య ప్రింటింగ్‌ ప్రెస్‌లో డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. అద్దె ఇంటి యజమాని పెట్టే తంటాలు భరించలేక కొత్త ఇంటి కోసం వెతుకుతుంటాడు. తన జీతానికి సరిపడే ఇల్లు దొరకక విసిగిపోతున్న సమయంలో సింధు (కయాదు లోహర్‌) అనే యువతి ఫోన్‌ చేసి షేరింగ్‌ ఫ్లాట్‌ గురించి చెబుతుంది. ఆమె ఫ్లాట్‌కు వెళ్లిన మహి, తొలి చూపులోనే సింధుపై మనసు పారేసుకుంటాడు. సింధు కూడా కలివిడిగా మెలగుతూ మహితో త్వరగానే కలిసిపోతుంది. అతను అడిగినది వెంటనే కొనిపెట్టి పెట్టేంతగా అతనిపై మమకారం చూపుతుంది.

అదే ఫ్లాట్‌లో ఉంటున్న సింధు తాతయ్య ఆకాశ్‌ (టీఎమ్‌ కార్తిక్‌) ద్వారా ఆమె గురించి ఓ రహస్యం మహికి తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన తర్వాత మహి భయంతో వణికిపోతాడు. ఆ ఫ్లాట్‌, అపార్ట్‌మెంట్‌ నుంచి పారిపోదామనుకుంటాడు. అయితే పరిస్థితుల వల్ల తిరిగి అక్కడికే వస్తాడు. వెయ్యేళ్ల క్రితం ఆటవిక జాతిలో పుట్టిన మృగానికి సింధుతో ఉన్న సంబంధం ఏమిటి? సింధు అసలు ఎవరు? మహి ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే చిత్ర కథ.

దర్శకుడు మారియప్పన్‌ చిన్న హారర్‌ కథకు ఫాంటసీ ఎలిమెంట్స్‌ జోడించి కొత్తగా చూపించాలని ప్రయత్నించారు. ఆలోచన ఆసక్తికరంగా ఉన్నా, తెరపైకి వచ్చేసరికి సినిమా ఓ రొటీన్‌ థ్రిల్లర్‌లా మారిపోయింది. కథ స్వభావం వల్ల దర్శకుడికి సినిమాటిక్‌ స్వేచ్ఛ ఎక్కువగా లభించడంతో, అనేక సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా సాగుతాయి.

మహి ఉద్యోగం, అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలతో సినిమా మొదలై, త్వరగానే సింధు ఎంట్రీతో అసలు కథ ట్రాక్‌ ఎక్కుతుంది. సింధు ట్రాప్‌లో మహి పడటం, ఆమె అందానికి ముగ్ధుడవడం వంటి సన్నివేశాలు తెరపై కనిపిస్తున్నా, అంతర్లీనంగా ఏదో రహస్యం దాగి ఉందన్న ఊహ ప్రేక్షకుడిని వెంటాడుతుంది. ఆకాశ్‌ పాత్ర ద్వారా సింధు గురించి అసలు విషయం బయటపడిన తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటివరకు సాగిన రొమాంటిక్‌ డ్రామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌గా మారుతుంది.

సింధు ఉన్న అపార్ట్‌మెంట్‌ గురించి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి ఇంటర్వెల్‌ పెట్టిన దర్శకుడు, ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచారు. అసలు సింధు ఎవరు? ఎందుకు మహినే టార్గెట్‌ చేసింది? ఆమె వెనుక ఉన్నది ఎవరు? వంటి ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు లభిస్తాయి. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ప్రీక్లైమాక్స్‌లో సింధు అసలు రూపం బయటపడినప్పుడు మహితో పాటు ప్రేక్షకుడూ ఆశ్చర్యపోతాడు. చివరి 20 నిమిషాల్లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లు బాగానే ఎంగేజ్‌ చేస్తాయి. పార్ట్‌–2 ఉంటుందని సూచిస్తూ సినిమాను ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. మహి పాత్రలో జీవీ ప్రకాశ్‌ ప్రేమ, భయం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాలను బాగా పండించారు. కయాదు లోహర్‌ ఈ చిత్రానికి ప్రధాన బలం. సింధు పాత్రలో ఒదిగిపోయి, కళ్లతోనే హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. సింధు అసలు ఎవరో తెలిసిన తర్వాత, ఆమె అందం వెనుక అంత భయానక కథ ఉందా అన్న భావన కలుగుతుంది.

సాంకేతికంగా సినిమా బాగుంది. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అనేక సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. మారియప్పన్‌ చిన్న ఎంచుకున్న పాయింట్‌ మాత్రం కొత్తది కాదు. ‘నీలాంబరి’, ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో చూసిన ఎలిమెంట్స్‌ ఇక్కడ కూడా కనిపిస్తాయి. అయితే ఇందులో చూపించిన మృగం ఎలిమెంట్‌ మాత్రం కొంత కొత్తగా అనిపిస్తుంది. పరిమిత బడ్జెట్‌, పరిమిత లొకేషన్‌లో సినిమా తెరకెక్కించారు.

బలాలు పరంగా జీవీ ప్రకాశ్‌, కయాదు లోహర్‌ నటన, ద్వితీయార్ధం, నిడివి ప్లస్‌ పాయింట్లుగా నిలిచాయి. బలహీనతల విషయానికి వస్తే తెలిసిన కథే కావడం, సినిమాటిక్‌ లిబర్టీ మరీ ఎక్కువగా తీసుకోవడం మైనస్‌గా మారాయి.

మొత్తానికి.. పాత కథకు కొత్త హంగులు జోడించిన ‘ఇమ్మోర్టల్‌’ హారర్‌–ఫాంటసీ థ్రిల్లర్‌గా జస్ట్‌ టైమ్‌ పాస్‌ స్థాయిలోనే నిలిచింది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

రేటింగ్ : 2.5/5