సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భారీ స్థాయిలో ప్రణాళికలు వేసుకుంటున్నాడు. రజనీకాంత్‌తో ఫేస్ ఆఫ్‌కు సమాన స్థాయిలో నిలబడగల స్టార్స్ చాలామంది ఉన్నప్పటికీ, ఈసారి యాంటాగనిస్టుగా మహిళా నటిని ఎంపిక చేయడం విశేషం. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకురాలిగా విద్యాబాలన్ కనిపించనుంది.

విద్యాబాలన్ ఈ సినిమాలో ‘కాంత’ అనే శక్తివంతమైన పాత్రలో, ఇంటెన్స్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సౌత్ మూలాలు ఉన్న విద్యాబాలన్ బాలీవుడ్‌లో పాపులర్ అయి అక్కడే స్థిరపడినా, దక్షిణాది సినిమాలంటే ఉన్న అభిమానంతో ఇక్కడి నుంచి వచ్చే అవకాశాలను కూడా స్వీకరిస్తోంది. ఉరుమి , ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి చిత్రాల్లో నటించి మంచి నటనతో ఆకట్టుకుంది.

తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన నీరుకొండ పార్వై లో చిన్న పాత్ర చేసిన విద్యాబాలన్, ఇప్పుడు Jailer 2లో పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విద్యాబాలన్ చేయబోయే ‘కాంత’ పాత్ర, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్రను మించి ఉండబోతోందనే టాక్ ఫిల్మ్ నగరంలో వినిపిస్తోంది.

తాజాగా విడుదల చేసిన జైలర్ 2 కాంత ప్రోమో చూసిన సినీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ‘నీలాంబరి’ పాత్రలో రమ్యకృష్ణ తలైవర్ రజనీకాంత్‌ను కూడా స్క్రీన్‌పై డామినేట్ చేసిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో, లేదా దానికంటే ఎక్కువగా విద్యాబాలన్ కూడా ‘కాంత’ పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందేమో అన్న ఆసక్తి పెరుగుతోంది.

ప్రస్తుతం విద్యాబాలన్ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. జైలర్ 2తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా, అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా కనిపించనుంది.

డర్టీ పిక్చర్ సినిమా విద్యాబాలన్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచినట్టు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే తరహాలో, జైలర్ 2లోని ‘కాంత’ పాత్ర ఆమెను మరో మెట్టెక్కించే పాత్రగా మారుతుందేమో అన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది.