ప్రస్తుతం ఇండియన్‌ సినిమా రంగంలో కొత్త తరహా అందాల నటి మణులు బాగా పెరిగారు. అందులో ఇద్దరు ప్రత్యేకంగా సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరు అందాల అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, మరోకరు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీలీల. ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారన్న సమాచారం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వెండితెరపై ఒక్కొక్కరిని చూసినా అభిమానులు మైమరచిపోతుంటారు. అలాంటి ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ప్రేక్షకులకు మరింత ఆనందం కలగడం సహజం. ఇప్పుడు అలాంటి బంపర్‌ ఆఫర్‌ మొత్తం ఇండియన్‌ సినిమాకు రానుందనే టాక్‌ వినిపిస్తోంది. జాన్వీ కపూర్‌, శ్రీలీల ఒకే వ్యక్తితో ప్రేమలో పడే కథతో సినిమా రూపుదిద్దుకుంటోందని సమాచారం.

ఆ ప్రేమను పొందే కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో కథలో చూపించబోతున్నారట. అయితే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఇది పండగ సినిమాగా మారే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గుణీత్ Monga, ఏక్తా కపూర్ సంయుక్త నిర్మాణంలో రాబోయే ఒక చిత్రానికి జాన్వీ, శ్రీలీల పేర్లను పరిశీలించి, దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరి ప్రేమను పొందే హీరో ఎంపిక కోసం ప్రస్తుతం వెతుకులాట కొనసాగుతోందని సమాచారం. ఈ చిత్రానికి ఉమేష్ బీస్ట్ దర్శకత్వం వహించబోతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో నటించే హీరో స్టార్‌ హీరో అయ్యే అవకాశం తక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. కథ మొత్తం హీరోయిన్స్‌ ఓరియెంటెడ్‌గా ఉండబోతోందని, జాన్వీ–శ్రీలీల పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఒకవేళ సినిమాలో ఇద్దరూ అక్కచెల్లెల్లుగా కనిపించేలా కథ మలిస్తే, జాన్వీ కపూర్‌నే అక్క పాత్రలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జాన్వీ కపూర్‌ ప్రస్తుత పనుల విషయానికి వస్తే, ఆమె ‘లగ్‌ జా గాలే’ అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు శ్రీలీల బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో చాలా నెలలుగా నటిస్తోంది. ఆ సినిమా ఇంకా పూర్తికాలేదు. ఆ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక తమిళంలో ధనుష్ సరసన ‘ఓమ్‌’ అనే సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఇది తప్ప ఆమె చేతిలో ప్రస్తుతం మరో సినిమా లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ–శ్రీలీల తదుపరి చిత్రం ఈ కొత్త ప్రేమకథే అయ్యే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.