రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రివ్యూ:- ఓటీటీలోకి వచ్చిన హారర్ కామెడీ ‘కరక్కం’
మలయాళ చిత్రాలు వైవిధ్యమైన కథలు, సహజత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్, ఊహించని మలుపులతో సాగే హారర్ చిత్రాలకు విపరీతమైన ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన సరికొత్త మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా ‘కరక్కం’ (Karakkam) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ Sony LIVలో జూలై 3 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. భయపెట్టే అంశాలతో పాటు వినోదాన్ని పంచే విధంగా కథను తెరకెక్కించారు.
కథలోకి వెళ్తే… ధనుష్ (శ్రీనాథ్ భాసి) పెద్దగా సంపాదన లేని ఒక డాన్సర్. ఇంట్లో వాళ్ల మాటలు పడలేక ఇబ్బంది పడుతుంటాడు. అతనికి అండగా నిలిచేది అతని ప్రేమికురాలు పింకీ (ఫెమినా జార్జ్) మాత్రమే. ఈ క్రమంలో ధనుష్‌కు ఖాజా (ప్రవీణ్) అనే వ్యక్తి పరిచయమవుతాడు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వీరిద్దరూ బాగా మద్యం సేవించి మత్తులో ఒక స్మశానానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి తిరిగి వస్తూ సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి సిలువలను దొంగిలిస్తారు. ఆ హడావుడిలో ధనుష్ తన రూమ్ కీని అక్కడే పోగొట్టుకుంటాడు. తర్వాత వారు దొంగిలించిన సిలువలను కొనే వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందాడు. మరోవైపు, పోయిన కీ కోసం మళ్లీ స్మశానానికి వెళ్లిన ధనుష్, ఖాజాలకు అక్కడ పోలీసులు కనిపిస్తారు.
అదే సమయంలో సమాధులపై ఉన్న సిలువలను దొంగిలించిన వారిని ప్రేతాత్మలు వదలవని చర్చి ఫాదర్ హెచ్చరిస్తాడు. దీంతో ధనుష్, ఖాజాల్లో భయం మొదలవుతుంది. అన్నట్టుగానే ఐదు ఆత్మలు వీరిని వెంటాడడం ప్రారంభిస్తాయి. ఆ ఆత్మల నేపథ్యం ఏమిటి? అవి వీరిని ఎందుకు వేధిస్తున్నాయి? ఈ ప్రమాదం నుంచి ధనుష్ ఎలా బయటపడతాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన ఆసక్తికరమైన కథ.
సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఖైదీ’, ‘విక్రమ్ వేద’ చిత్రాలకు సంగీతం అందించిన శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ కామెడీ వాతావరణానికి ప్రాణం పోశాయి.
సరికొత్త మ్యూజికల్ కాన్సెప్ట్‌తో భయపెడుతూనే నవ్వించే ఈ ‘కరక్కం’ సినిమాను ఈ వీకెండ్‌లో Sony LIVలో ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు.
రివ్యూ:- 2.5/5







