రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. డెబ్యూ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తో ఒక్క రాత్రిలో స్టార్‌డమ్ అందుకుని సంచలనంగా మారిన కార్తికేయ, ఆ తర్వాత ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన ‘వలిమై’ చిత్రంలో విలన్‌గా నటించి తనలోని విభిన్న కోణాన్ని చూపించాడు. అయితే గత రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ యువ హీరో, ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాడు.
కేవలం హీరోగానే కాకుండా, దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కార్తికేయ నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఆయన చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ‘కమ్‌బ్యాక్’. ఈ చిత్రానికి కథను కార్తికేయ స్వయంగా రాసుకుని, దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో వినిపించిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ ప్రస్తుతం నెట్టింట ఆసక్తి రేపుతున్నాయి.
“బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది.. మూడేళ్ళ నుంచి ఏమైపోయాడో తెలియలేదు.. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్ (ఒక విధంగా అది ఆత్మహత్య చేసుకోవడమే)”
ఈ డైలాగ్‌లతో సినిమా కథపై, కార్తికేయ పోషిస్తున్న పాత్రపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. గ్లింప్స్ ప్రకారం కార్తికేయ ఒక పవర్‌ఫుల్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తూ తన సిక్స్ ప్యాక్ బాడీని ఆవిష్కరించిన కార్తికేయ, సూపర్ ఫిట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. జగదీశ్ చీకటి విజువల్స్ ఈ గ్లింప్స్‌కు గ్రిప్పింగ్ ఫీల్‌ను తీసుకువచ్చాయి.
ఈ చిత్రాన్ని కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన సతీమణి లోహితా రెడ్డిని నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు. సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా సూర్య ఆకెళ్ల పని చేస్తున్నారు. ‘బేబీ’ చిత్రంతో గుర్తింపు పొందిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. గ్లింప్స్‌లో వినిపించిన బీజీఎమ్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది.
ఒకేసారి హీరోగా నటించడం, దర్శకత్వ బాధ్యతలు మోయడం, పైగా నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం సాధారణ విషయం కాదు. అందులోనూ రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘కమ్‌బ్యాక్’ కార్తికేయ కెరీర్‌కు కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు సినీ వర్గాలు. తన స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ ‘కమ్‌బ్యాక్’తో కార్తికేయ నిజంగానే సాలిడ్ రీఎంట్రీ ఇస్తాడా, లేక గ్లింప్స్‌లో వినిపించినట్లే ఇది సూసైడ్ మిషన్‌గా మారుతుందా అన్నది టీజర్, ట్రైలర్, చివరికి సినిమా విడుదల తర్వాతే తేలనుంది.







