ముంబై: రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ప్రకటనలో తన దుస్తులపై వచ్చిన తీవ్ర విమర్శలు, వివాదంపై బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ తాజాగా స్పందించారు. కరీనా కపూర్ ఖాన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న టాక్ షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో పాల్గొన్న ఆమె, ఆ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.

గతంలో జ్యువెల్లరీ బ్రాండ్ GIVA రూపొందించిన రక్షాబంధన్ ప్రకటనలో కృతి సనన్ మోడరన్ ఇండో-వెస్ట్రన్ శైలిలో ఉన్న బ్లౌజ్‌ (చోళీ) ధరించారు. ఆ డిజైన్‌పై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సంప్రదాయ పండుగకు అనుగుణంగా దుస్తులు లేవని, సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు వ్యాఖ్యానించారు. ఈ విమర్శలు తరువాత కొన్ని టెలివిజన్ న్యూస్ ఛానెళ్లలో చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే.

“నేను వేసుకున్న బ్లౌజ్‌ (చోళీ)పై ప్రైమ్‌టైమ్ న్యూస్ ఛానెళ్లలో ఏకంగా ఆరుగురు ప్యానలిస్టులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించడం చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను”

అని కృతి సనన్ నవ్వుతూనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో నటిగా తన దుస్తుల ఎంపికపై ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరగడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని ఆమె తెలిపినట్లు షోలో ప్రసారమైంది.

రక్షాబంధన్ యాడ్‌ చుట్టూ నెలకొన్న ఈ వివాదం సందర్భంగా మహిళల దుస్తుల ఎంపికపై సమాజంలో కొనసాగుతున్న చర్చలను కూడా కృతి ప్రస్తావించారు. మహిళలు ఏం ధరించాలనే అంశంపై కాకుండా, వారి భావాలు, ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడినట్లు షోలో వెల్లడైంది. సంస్కృతి అనేది పండగను ఎలా భావిస్తామన్నదిలో, మనసులో ఉండేదే గానీ, వేసుకునే బట్టల నెక్ లైన్‌లో కొలవలేమని కృతి మరోసారి స్పష్టం చేసినట్లు కార్యక్రమంలో చర్చ జరిగింది.

కృతి సనన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రక్షాబంధన్ వంటి కుటుంబ పండుగల సందర్భంలో మహిళల దుస్తులపై విమర్శలు చేయడం కంటే, పండుగ వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అనే అభిప్రాయాన్ని పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సంప్రదాయ విలువలను కాపాడాలనే వాదనను ముందుకు తెస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృతి సనన్ తాజా వ్యాఖ్యలు మహిళల దుస్తుల స్వేచ్ఛ, వ్యక్తిగత అభిరుచులపై జరుగుతున్న విస్తృత చర్చకు కొత్త కోణాన్ని జోడించినట్టయ్యాయి.