మా ఇంటి బంగారం సెన్సార్ పూర్తి..

సమంత యాక్షన్ థ్రిల్లర్‌పై పాజిటివ్ టాక్

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `మా ఇంటి బంగారం` సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సమంత నటిగా తెరపై కనిపించబోతున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. చివరిసారిగా ఆమె `ఖుషి` చిత్రంలో నటించింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆ గ్యాప్ తర్వాత `మా ఇంటి బంగారం`తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

తాజాగా పూర్తయిన సెన్సార్ ప్రక్రియలో `మా ఇంటి బంగారం`కి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రం నిడివి రెండు గంటల 20 నిమిషాలు (140 నిమిషాలు)గా నిర్ణయించారు. నిడివి పరంగా కూడా డిసెంట్ రేంజ్‌లోనే ఉందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. సెన్సార్ టాక్ ప్రకారం సినిమాపై పాజిటివ్ రిపోర్ట్ వినిపిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో యాక్షన్ పాత్రతో ఆకట్టుకున్న సమంత, ఈసారి `మా ఇంటి బంగారం`లో కూడా తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో ఆకర్షించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మూడేళ్ల తర్వాత సమంత నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఆమె అభిమానులు బిగ్ స్క్రీన్‌పై ఆమెను చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంతలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని, అందుకే సినిమాపై మంచి బజ్ ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. `ఓ బేబీ` తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఇదే కావడం మరో ప్లస్ పాయింట్‌గా మారింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్‌పై మరింత దృష్టి పడుతోంది.

సినిమా చూసిన వారిలోంచి వస్తోన్న టాక్ ప్రకారం `మా ఇంటి బంగారం` కథ, నిర్మాణం పరంగా బలంగా ఉందని చెబుతున్నారు. ఇందులో సమంత ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కోడలిగా కనిపించబోతోంది. ఇంట్లో పద్ధతిగా, సాదాసీదాగా కనిపించే ఆమె, తెరవెనుక మరో వైపు చూపించే పాత్రలో నటించినట్లు సమాచారం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథగా వినిపిస్తోంది.

యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని, కామెడీ కూడా బాగుంటుందని టాక్ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ప్రేక్షకులకు సర్ప్రైజ్‌లను అందించే విధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అదనపు బలం చేకూర్చే అంశాలుగా మారనున్నాయని సమాచారం. మొత్తం మీద `మా ఇంటి బంగారం`పై పాజిటివ్ టాక్ నెలకొన్న నేపథ్యంలో, జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి.