రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్, కలిపు మధు నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈనెల 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందుగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హీరో అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రబృందం, ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
“మంచి కథా బలమున్న సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఇది కచ్చితంగా బాగా ఆడుతుంది.. పెద్ద హిట్ కాబోతుంది” అని కథానాయకుడు అఖిల్ అన్నారు.
ప్రస్తుత కాలంలో కథా ప్రధాన చిత్రాలకే ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కంటెంట్‌పై నమ్మకం ఉంచి, దాన్ని నాణ్యంగా తెరకెక్కించి థియేటర్లకు తీసుకురావడం ముఖ్యం అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సుమంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలన్నీ సుమంత్‌కే చెప్పేవాడినని, ఆయన తనను ఎప్పుడూ నిరాకరించలేదని తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ ఒకవైపు హీరోగా హిట్లు అందుకుంటూనే, ఇలాంటి నిజాయతీ గల కంటెంట్ సినిమాలకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి ఎంతో శ్రమించారని, ఇది నేటి తరానికి నచ్చే సినిమా అవుతుందని అన్నారు.
“ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ నటించలేదు.. జీవించారు. ఈ చిత్రంతో అనూప్ రూబెన్స్ 2.ఓని చూస్తారు. సిద్ధు జొన్నలగడ్డ పోషించిన పాత్ర వల్ల ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది” అని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అన్నారు.
“ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదో ఓ తెలియని శక్తి మా వెనకుండి మమ్మల్ని నడిపిస్తుందన్న నమ్మకం ఉండేది. అదిప్పుడు అందరికీ కనిపిస్తోందని నమ్ముతున్నా. సెప్టెంబరు 11న మా కష్టాన్ని చూడబోతున్నారు. దీనిపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఫస్ట్‌హాఫ్ కన్నా సెకండాఫ్ దుమ్ము దులిపేసేలా ఉంటుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ పాత్ర చాలా కీలకంగా నిలుస్తుంది. ఇందులో నాకు, తనకీ మధ్య వచ్చే ఎపిసోడ్ ఆకర్షణగా నిలుస్తుంది” అని కథానాయకుడు సుమంత్ అన్నారు.
“నిర్మాత మధు వల్లే నేనీ చిత్రంలో భాగమయ్యా. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు తీశారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.
ప్రీరిలీజ్ వేడుకకు బ్రహ్మానందం, అలీ, లక్ష్మణ్, మధు, అనూప్ రూబెన్స్, కాసర్ల శ్యామ్, వెనిగళ్ల రాంబాబు, మంజు భార్గవి, జెస్సీ గిఫ్ట్ తదితరులు హాజరయ్యారు. చిత్రబృందం మొత్తం సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.







