వెండితెరపై కథలు మారుతుంటాయి, ట్రెండ్స్‌ మారుతుంటాయి. కానీ గుండెల్ని కదిలించే ‘నాన్న’ అనే భావోద్వేగానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తూనే ఉంది. అందుకే ఆ అందమైన అనుబంధాన్ని ప్రతి తరానికి కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ సినీప్రియుల్ని అలరించేందుకు మన సినీతారలు తరచూ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం కూడా నాన్న పాత్రల చుట్టూ తిరిగే కథలతో వెండితెరపై యాక్షన్‌ హంగామా చేయడానికి, భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసుల్ని బరువెక్కించడానికి పలువురు అగ్ర హీరోలు సిద్ధమవుతున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా అలాంటి చిత్రాలపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మాస్‌ సినిమాలు అంటే కేవలం గన్స్‌, గ్యాంగ్‌స్టర్స్‌, ఫైట్లు మాత్రమే కాదని, ఓ తండ్రి తన పిల్లల కోసం నిలబడినప్పుడు థియేటర్లలో వచ్చే పూనకాలు అంతకంటే పెద్ద మాస్‌ అనుభూతిని ఇస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు నాన్న ఎమోషన్‌నే ప్రధాన ఆయుధంలా మలుచుకుని మాస్‌ యాక్షన్‌ చిత్రాలను రూపొందించేందుకు తెలుగులో పలువురు కథానాయకులు ముందుకు వస్తున్నారు.

ఇటీవల సంక్రాంతి సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో విజయాన్ని అందుకున్న కథానాయకుడు చిరంజీవి, అదే జోష్‌లో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిత్ర బృందం సమాచారం ప్రకారం, ఈసారి ‘వాల్తేరు వీరయ్య’ను మించేలా భారీ యాక్షన్‌ కథను సిద్ధం చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ యాక్షన్‌ కథ అసలు సిసలైన బలం తండ్రీకూతుళ్ల అనుబంధమే అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కూతురి కోసం ఎంతకైనా పోరాడే పవర్‌ఫుల్‌ తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం.

ఈ చిత్రంలో కూతురు పాత్రను అనస్వర రాజన్‌ పోషిస్తోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. పనులు అనుకున్న ప్రకారం సాగితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.