‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి–దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతమవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇవ్వడం, ‘పండుగ టార్గెట్’ పేరుతో సునీల్ అడిగిన లీవ్‌ను తిరస్కరించడం వంటి సహజమైన సన్నివేశాలతో కథనం ముందుకు సాగుతుంది.

గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోతాయి. ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం, ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే ప్రయత్నంలో నీటిలో నుంచి తుపాకులు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అద్దాలు ధరించిన మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ రూపంలో మెగాస్టార్ హుందాగా కనిపిస్తుండగా, వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

అనంతరం వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తోంది. బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్‌గా ఒడిసిపట్టినట్టు గ్లింప్స్‌లో కనిపిస్తోంది.

విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆద్యంతం రిచ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్ జోడించడం గ్లింప్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి, భాను–నందు రచనా సహకారం అందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.