రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో ‘మన్మథుడు’గా పేరుపొందిన కింగ్ నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను అలరించిన నాగార్జున, ఇటీవల తన ఎంపికల్లో మార్పు చేసి యాక్షన్ చిత్రాలపై దృష్టి సారించారు. అదే దిశగా ఆయన శత చిత్రం పూర్తిస్థాయి యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. చిత్రీకరణలో ఇప్పటికే సుమారు 80 శాతం పని పూర్తయినట్లు సమాచారం. లాటరీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని ఫిల్మ్ నగర్ టాక్. అందుకే ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది.
ఈ చిత్రంలో టబు నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. గతంలో నాగార్జున–టబు జంటగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది.
నాగార్జున 100వ చిత్రంలో కూడా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ఉంటాయని ఇటీవల వరకు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి టబు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె హీరోయిన్‌గా కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న అత్యంత పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
నాగార్జున, టబుల మధ్య వచ్చే యాక్షన్ సీన్లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇద్దరి మధ్య జరిగే ఘర్షణాత్మక సన్నివేశాలను బలంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శత చిత్రంగా వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానులతో పాటు పరిశ్రమలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. టైటిల్, విడుదల తేదీ, ఇతర నటీనటుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.







