రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: దక్షిణాది చిత్రాలతో పాటు ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు పొందుతున్న నటి రుక్మిణీ వసంత్ మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశమున్నట్లు సమాచారం. ‘స ప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ఆమెకు విస్తృతమైన అభిమాన వర్గం ఏర్పడింది.
ప్రస్తుతం రుక్మిణీ వసంత్ చేతుల్లో యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘టాక్సిక్’, ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను మరో తెలుగు చిత్రానికి ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
కథానాయకుడు నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై రూపొందబోయే కొత్త చిత్రంలో రుక్మిణీ వసంత్‌ను నాయికగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాని నిర్మాణ సంస్థ నుంచి గతంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో, కొత్త ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని ‘దండోరా’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించనున్నారని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే పనులతో పాటు ఇతర పూర్వ నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథానాయకుడి ఎంపిక దశలోనే ఉండటంతో, నటీనటుల ఎంపిక పూర్తయ్యాకే చిత్రబృందం అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై వస్తున్న ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉండటం, రుక్మిణీ వసంత్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల స్థాయి దృష్ట్యా ఈ కలయికపై కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాని నిర్మాణ సంస్థ నుంచి రాబోయే ఈ కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.







