రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటులుగా మమ్ముట్టి(Mammootty), కార్తిక్ ఆర్యన్(Kartik Aaryan) సత్తా చాటారు. ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతం(Yami Gautam) కైవసం చేసుకున్నారు. మమ్ముట్టికి ఇది నాలుగో జాతీయ పురస్కారం కాగా, కార్తిక్ ఆర్యన్, యామీ తొలిసారి ఆ గౌరవాన్ని పొందారు. వారు తమ అభినయంతో మెప్పించిన పాత్రల విశేషాలేంటో చూద్దాం.
మమ్ముట్టి.. నటనతో మరోసారి అదరగొట్టి..
సరికొత్త సాంకేతికతతో వెండితెరపై రంగుల లోకాన్ని ఆవిష్కరించడానికి పోటీపడుతున్న ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా తీయడమా? అందులోనూ ఓ అగ్ర హీరో అందులో నటించడమా? పైగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించడమా? ‘భ్రమయుగం’(Bramayugam)తో ఆ సాహసం చేశారు మమ్ముట్టి. పీరియడ్ ఫోక్ హారర్ తెరకెక్కిన ఆ చిత్రంలో కొడుమన్ పొట్టి అనే ఓ మిస్టీరియస్ క్యారెక్టర్‌ను పోషించిన ఆయన.. విభిన్నమైన ఆహార్యం, విలక్షణమైన నటనతో కట్టిపడేశారు. సినిమా ఆసాంతం ఒంటిపై చొక్కా లేకుండా, మెడలో ఓ పూసల దండ వేసుకొని ఓ చెక్క కుర్చీపై కూర్చొని, తక్కువగా మాట్లాడుతూ, భయంకరంగా నవ్వుతూ మమ్ముట్టి చూపిన అభినయాన్ని ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ చిత్రానికిగానూ ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న మమ్ముట్టి, తాజాగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సైతం కైవసం చేసుకోవడం విశేషం.
కార్తిక్ ఆర్యన్.. ‘నేషనల్’ ఛాంపియన్!
బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్ తన నటనతో జాతీయ వేదికపై మెరిశారు. ‘చందూ ఛాంపియన్’(Chandu Champion) చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా మమ్ముట్టితో కలిసి పురస్కారాన్ని పంచుకొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన మొట్టమొదటి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓ కుగ్రామంలో జన్మించి, భారత్‌కు ఎలాగైనా ఒలింపిక్స్ పతకాన్ని తీసుకురావాలని తపించిన చందూ అనే యువకుడిగా కార్తిక్ ఆర్యన్ మెప్పించారు. ఆర్మీలో సైనికుడిగా చేరి, భారత్-పాక్ యుద్ధంలో వెన్నెముకకు గాయం కావడంతో వికలాంగుడిగా మారిన చందూ.. స్విమ్మర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి పారా ఒలింపిక్స్‌లో విజేతగా ఎలా నిలిచాడన్నది ఈ చిత్రంలో స్ఫూర్తిదాయకంగా చూపించారు. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, కొత్త దారిలో తనను తాను మలుచుకొనే పాత్రలో కార్తిక్ ఆర్యన్ తన నటనతో జ్యూరీని మెప్పించారు.
యామీ గౌతం.. అబ్బురపరిచే అభినయం
బాలీవుడ్ నటి యామీ గౌతం పంథానే వేరు. రాశి కన్నా వాసికి ప్రాధాన్యమివ్వడం ఆమె శైలి. తొలి నుంచి నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. అందుకే తన కెరీర్లో తక్కువ చిత్రాలే చేసినప్పటికీ, తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ‘ఆర్టికల్ 370’(Article 370)తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు. ఈ చిత్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారిణి జూనీ హక్సర్‌గా ఓ శక్తిమంతమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆమె భర్త, దర్శకుడు ఆదిత్య ధర్ స్క్రీన్‌ప్లేలో సహకారం అందించారు. గతంలో ఆదిత్య ధర్ ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్స్’ చిత్రానికిగానూ ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి అయిన యామీకి కూడా నేషనల్ అవార్డ్ దక్కడం గమనార్హం.







