బాలీవుడ్ మీడియా విమర్శలపై చర్చ

దాదాపు దశాబ్దం నుంచి భారతీయ సినీ వర్గాల్లో కొనసాగుతున్న ఒక చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సౌత్ సినిమా ఎదుగుదలను బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేకపోతుందనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం చుట్టూ నెలకొన్న వివాదం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.

‘పెద్ది’లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను అత్యంత గ్లామరస్‌గా చూపించారని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది బాలీవుడ్ మీడియా ప్రతినిధులు సౌత్ సినిమాల్లో హీరోయిన్లను తరచూ ఇలా చూపిస్తారని, ఇది కొత్తేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. సౌత్ సినిమాలపై విమర్శలు చేసే ఈ ధోరణి కొత్తకాదని, ప్రతి అవకాశం దొరికినప్పుడూ టార్గెట్ చేయడం అలవాటైందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక మరోవైపు, ఇండియన్ సినిమాకి గ్లామర్‌ను పరిచయం చేసింది, ఐటెం సాంగ్స్ సంస్కృతిని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది, బోల్డ్ కంటెంట్ పేరుతో అడల్ట్ కంటెంట్‌ను పెద్ద ఎత్తున చిత్రీకరించింది హిందీ సినిమానేనని సినీ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా ఆ సంస్కృతిని పెంచి పోషించిన బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ క్రియేటివిటీని ప్రశ్నించడం విరుద్ధమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘పెద్ది’ దర్శకుడు బూచి బాబు సన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడం, అనంతరం సినిమాలోని కొన్ని సీన్లను కట్ చేయడం మరింత చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా ట్రోల్స్, బాలీవుడ్ వర్గాల ఒత్తిడికి లొంగిపోయి సీన్లు తొలగించడం ద్వారా తాను తప్పు చేశానని ఒప్పుకున్నట్టే అయిందని కొందరు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

భవిష్యత్తులో అయినా మన ఫిల్మ్ మేకర్స్ గ్లామర్ సీన్స్ చిత్రీకరణలో మరింత ఆలోచించి, తమ క్రియేటివిటీపై నమ్మకం ఉంచి, తర్వాత ఒత్తిడులకు లొంగకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఆలోచించి తీసుకున్న సృజనాత్మక నిర్ణయాలపై వెనకడుగు వేయడం సరైంది కాదని వారు అంటున్నారు.

ఇదే సందర్భంలో ‘Animal’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఉదాహరణగా ప్రస్తావించబడుతున్నారు. ఆ సినిమా సమయంలో కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్, విమర్శలు వచ్చినప్పటికీ, తన కంటెంట్‌పై నమ్మకం ఉంచి వెనకడుగు వేయలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా తన దారిలో ఆయన నడిచారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

ఇక మరోవైపు, వివాదాల మధ్య కూడా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు కూడా ఈ చిత్రం బలమైన కలెక్షన్లు నమోదు చేసినట్టు సమాచారం. ఒకవైపు వసూళ్లు, మరోవైపు కంటెంట్‌పై విమర్శలు… ఈ రెండు మధ్య సౌత్ సినిమాలపై బాలీవుడ్ మీడియా వైఖరి, దర్శకుల స్పందనలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.