పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో చేసే ప్రతి చిన్న కదలిక కూడా అభిమానుల్లో భారీ హంగామా రేపుతోంది. తాజాగా ఆయన తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో నెట్టింట మరోసారి ప్రభాస్ పేరు ట్రెండింగ్‌లోకి చేరింది.

ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే డిస్‌ప్లే పిక్చర్‌ను కొనసాగిస్తూ వచ్చారు. తన కెరీర్‌ను పీక్ స్థాయికి తీసుకెళ్లి పాన్ ఇండియా స్టార్‌డమ్ తెచ్చిన “ బాహుబలి ” చిత్రంలోని ఫోటోనే దాదాపు ఏడు సంవత్సరాలుగా డీపీగా ఉంచారు. ప్రతి కొత్త సినిమా పోస్టర్లు, అప్‌డేట్లు, గ్లింప్సులు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూనే ఉన్నా, ప్రొఫైల్ పిక్ మాత్రం మార్చకుండా అలాగే ఉంచడం ఆయన ప్రత్యేకతగా మారింది.

అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రభాస్ తన రాబోయే చిత్రం “ఫౌజి"లోని లుక్‌తో ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు. “ఫౌజి” గెటప్‌లో ఉన్న ఈ కొత్త డీపీ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. డీపీ మారిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఆ ఫోటోను షేర్ చేస్తూ వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడంతో #PrabhasDP హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండ్‌గా మారింది. ఫౌజి

సాధారణంగా సినిమా టీజర్, ట్రైలర్ లేదా బాక్సాఫీస్ అప్‌డేట్ వచ్చినప్పుడు కనిపించే స్థాయి హంగామానే ఇప్పుడు ఒక చిన్న డీపీ మార్పుతోనే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్‌కు ఉన్న విస్తృత అభిమాన వర్గం, ఆయనపై ఉన్న క్రేజ్ సోషల్ మీడియా స్పందనతో మరోసారి స్పష్టమైంది.

ఇక ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా “ఫౌజి” చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం “ఫౌజి” షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 2న ప్రీమియర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.