రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ క్వీన్ ప్రీతి జింటా, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
ఒకప్పుడు వరుస హిట్‌లతో బాలీవుడ్ రారాణిగా వెలిగిన ప్రీతి జింటా, పెళ్లి తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు ది హీరో, దిల్లగి, భయ్యాజీ సూపర్‌హిట్ వంటి చిత్రాల తర్వాత మళ్లీ సన్నీ డియోల్ సరసన కథానాయికగా నటించడం ఈ కమ్‌బ్యాక్‌కు అదనపు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
ప్రీతి జింటా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా సాధారణమైన ప్రాజెక్ట్ కాదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ స్వయంగా తన Aamir Khan Productions బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 1947 నేపథ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పిరియాడికల్ డ్రామాకు బట్వారా 1947 అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌తోనే ప్రీతి జింటా చాన్నాళ్ల తర్వాత మళ్లీ తన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, దిగ్గజ రచయిత జావేద్ అఖ్తర్ సాహిత్యం సమకూర్చారు.
షబానా అజ్మీ, ఆలీ ఫజల్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ మూవీ, ప్రీతి జింటా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మానవీయ సంబంధాలు, దేశ విభజన సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రీతి జింటా అత్యంత బలమైన, భావోద్వేగపూరిత పాత్రలో కనిపించనున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు విస్తృతమైన అవకాశమున్న ఈ పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించేందుకు ప్రీతి జింటా సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







