ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘రాకా’ విడుదలకు ముందే అరుదైన గిన్నిస్ రికార్డు సాధించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్, ఎం. అశోక్ నారాయణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ‘రాకా’ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అట్లీ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా స్వయంగా అందిస్తున్నారు. జీ.కే. విష్ణు సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, రమ్యకృష్ణన్, జిమ్ సర్బ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘రాకా’ కోసం ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలను ఎంపిక చేశారు. లోలా VFX సహా పలువురు ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా జరుగుతున్న చిత్రీకరణతో ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రూపొందుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన ప్రత్యేక వీడియో ద్వారా ఈ మహత్తర ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను నిర్మాతలు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ చిత్రంలో అత్యాధునిక ‘మోషన్ క్యాప్చర్’ సాంకేతికతను విస్తృత స్థాయిలో వినియోగించడం ద్వారా ‘రాకా’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సాధారణంగా హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్స్‌లో మాత్రమే విస్తృతంగా ఉపయోగించే ఈ సాంకేతికతను, ఈ చిత్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో అమలు చేశారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోని ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్ టైమ్’ విభాగంలో ‘రాకా’కి రికార్డు లభించింది. అంటే ఏకకాలంలో 37 మంది పెర్ఫార్మర్ల కదలికలను రియల్ టైమ్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా ఈ రికార్డు సాధ్యమైంది. ఈ సందర్భంగా గిన్నిస్ ప్రతినిధుల నుంచి సర్టిఫికేట్ అందుకుంటున్న అల్లు అర్జున్, అట్లీ కుమార్‌ల ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

రిలీజ్‌కు ముందే ఇలాంటి అరుదైన రికార్డు సాధించడం ద్వారా ‘రాకా’పై అంచనాలు మరింత పెరిగాయి. టెక్నికల్ పరంగా తెలుగు సినిమా చేరుకున్న స్థాయిని ఈ రికార్డు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.