కారు కొనాలనే కోరికే తన నటనా ప్రయాణానికి ఆరంభమైందని కథానాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వెల్లడించింది. కాలేజీ చదువుతున్న రోజుల్లో అనుకోకుండా వచ్చిన తొలి సినిమా అవకాశమే ఈ రోజు కెమెరా ముందు నిలబెట్టిందని ఆమె పేర్కొంది.

ఇటీవల నిర్వహించిన ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన తొలి అవకాశంతో తన కెరీర్‌ ఎలా మలుపు తిరిగిందో వివరించింది.

“నేను కాలేజీలో చదువుతున్నప్పుడే అనుకోకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నాకొక అవకాశం వచ్చింది. ఎవరో కొంతమంది నా ఫొటోలు చూసి మా నాన్నని కలిశారు. ఓ సినిమాలో నటించేందుకు నన్ను తీసుకుంటామని అడిగారు. అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సినిమాలపై అప్పుడంతగా అవగాహన లేదు. కానీ, వాళ్లు ఆ సినిమాకు నాకు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామన్నారు. వాటితో కారు కొనుక్కోవాలి.. నా స్నేహితులందరిలో కారు ఉన్న మొదటి అమ్మాయిని నేనే అవుతానన్న ఒకే ఒక్క కారణంతో ఆ సినిమా చేయడానికి అంగీకరించాను. 40 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడే గ్రహించా కెమెరా ముందు ఉండడం నాకు ఎంతగానో ఇష్టమని. ముందు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తర్వాత నటనలోకి రావాలని నిర్ణయించుకున్నా. అందుకే కొంత విరామం తీసుకుని 2013లో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. ఎవరి ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నాకు నేనుగా అన్నీ నేర్చుకున్నా. ప్రారంభంలో చదువు కారణంగా కొన్ని పెద్ద సినిమాల్ని వదులుకోవల్సి వచ్చింది” అని అంది రకుల్‌.

2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో వెండితెరకు పరిచయమైన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కొంత విరామం తర్వాత తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

తన కెరీర్‌లో తొలి నిర్ణయం కేవలం కారు కోరికతో తీసుకున్నప్పటికీ, ఆ ప్రయాణమే నటనపై ప్రేమను పెంచిందని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ స్పష్టం చేసింది. చదువు, సినిమాల మధ్య సమతుల్యత సాధించే క్రమంలో కొన్ని పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హిందీ చిత్రం ‘రామాయణ’లో కీలక పాత్రలో నటిస్తోంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో ఆమె శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌, తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ రకుల్‌ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.