నువ్వు ఎవరి వారసుడివని ప్రేక్షకులు చూడరు: రామ్‌ చరణ్‌

హైదరాబాద్‌: సినిమా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రేక్షకులు తాము పెట్టే కష్టాన్నే గౌరవిస్తారని నటుడు రామ్‌ చరణ్‌ అభిప్రాయపడ్డారు. ‘రిపబ్లిక్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన తన కెరీర్‌, తండ్రి చిరంజీవి ప్రభావం, ఓటీటీ ధోరణులపై తన ఆలోచనలను పంచుకున్నారు.

బిజినెస్‌ భాషలో చెప్పాలంటే ‘పెద్ది’ సినిమా తన కెరీర్‌కు అత్యుత్తమ ‘స్టార్టప్‌’ లాంటిదని రామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించారు. చిన్నప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ దర్శకులు, నిర్మాతలు తరచూ తనను చిరంజీవితో పోల్చేవారని తెలిపారు.

తన నటనా ప్రయాణంలో చిరంజీవి నుంచి వచ్చిన ప్రభావం ప్రధానంగా క్రమశిక్షణ, పనితీరులోనే కనిపిస్తుందని రామ్‌ చరణ్‌ స్పష్టం చేశారు. నటన విషయంలో తండ్రి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం ఇచ్చారని చెప్పారు.

ఓటీటీ వేదికల ప్రభావం, థియేటర్ల భవిష్యత్తు గురించి మాట్లాడిన రామ్‌ చరణ్‌ రెండూ పరస్పరం తోడ్పడేలా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.

భారతీయ ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే దేశభక్తి కథలు ఎప్పటికీ నిలుస్తాయని, దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చే సినిమాలు ఎక్కువగా రావాలని రామ్‌ చరణ్‌ ఆకాంక్ష వ్యక్తం చేశారు.