‘రామాయణ’ ఆడియో హక్కులు రూ.75 కోట్లకు టీ-సిరీస్‌కు

భారతీయ చిత్రసీమలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘రామాయణ’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అంతర్జాతీయ పంపిణీ హక్కులను సోనీ పిక్చర్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ విషయంలో మరో పెద్ద అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. దేశంలో అగ్రశ్రేణి ఆడియో సంస్థ అయిన T-Series, ‘రామాయణ’ రెండు భాగాల ఆడియో హక్కులను ఏకంగా రూ.75 కోట్ల భారీ డీల్‌తో కైవసం చేసుకుంది.

ఈ సినిమా ఆడియో హక్కుల కోసం దేశంలోని ప్రధాన ఆడియో లేబుల్స్ పోటీ పడినప్పటికీ, భూషణ్ కుమార్ ఆధ్వర్యంలోని T-Series భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి ఒప్పందాన్ని ముగించింది. ఈ చిత్ర సౌండ్‌ట్రాక్ అపారమైన ప్రజాదరణ పొందుతుందనే పూర్తి నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. రూ.75 కోట్ల ఈ డీల్ రీఫండబుల్ అడ్వాన్స్ ఒప్పందం కింద కుదిరినట్లు సమాచారం.

భారతీయ సంగీత పరిశ్రమలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ ఆడియో హక్కుల ఒప్పందాలలో ‘రామాయణ’ డీల్ ఒకటిగా నిలిచింది. ఈ భారీ ఒప్పందం ద్వారా T-Series మ్యూజిక్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవడమే కాకుండా, సినిమా ఆల్బమ్‌పై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచింది.

‘దంగల్’ వంటి ఆల్‌టైమ్ హిట్ చిత్రాన్ని అందించిన నితీష్ తివారి ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత మల్హోత్రా దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి Oscar విజేతలు A.R. రెహమాన్ , హన్స్ జిమ్మర్ సంయుక్తంగా సంగీతాన్ని అందించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక ఇతిహాసం మొదటి భాగం 2026 దివాళి సందర్భంగా, రెండో భాగం 2027 దివాళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మ్యూజిక్ రంగంలో టాప్-5 భారీ రైట్స్ డీల్స్

‘రామాయణ’తో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్ రైట్స్ పరంగా టాప్-5లో నిలిచిన సినిమాల జాబితా విశేషంగా ఉంది. భారతీయ సినిమాల్లో సంగీతం విజయానికి ప్రధాన బలం. ఇటీవల పాన్-ఇండియా సంస్కృతి పెరిగిన నేపథ్యంలో పెద్ద హీరోల చిత్రాల మ్యూజిక్ రైట్స్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది.

ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ‘ పుష్ప 2: ది రూల్ ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో హక్కులను T-Series సంస్థ సుమారు రూ.60 కోట్లకు కొనుగోలు చేసి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. దీని తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ గేమ్ ఛంజెర్ ’ చిత్రం ఆడియో హక్కులను సరిగమ సంస్థ దాదాపు రూ.33 కోట్లకు కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. ఈ భారీ ఆఫర్లు భారతీయ మ్యూజిక్ మార్కెట్ స్థాయిని ప్రపంచ వేదికపై కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.

టాప్-5 డీల్స్‌లో మిగిలిన సినిమాలను పరిశీలిస్తే, Yash నటించిన బ్లాక్‌బస్టర్ ‘KGF: చాప్టర్ 2’ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ –T- సిరీస్ కాంబినేషన్ దాదాపు రూ.30 కోట్లకు సొంతం చేసుకుని మూడో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 మ్యూజిక్ రైట్స్ కూడా దాదాపు రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్ల మధ్య బిజినెస్ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.

రజినీకాంత్ నటించిన ‘ జైలర్ ’, దలపతే విజయ్ నటించిన ‘GOAT’ వంటి తమిళ ప్రతిష్టాత్మక చిత్రాల మ్యూజిక్ హక్కులు కూడా ఒక్కొక్కటి దాదాపు రూ.25 కోట్ల వరకు పలికాయి. పాన్-ఇండియా సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగానే ఆడియో కంపెనీలు ఈ స్థాయిలో కోట్ల రూపాయలను వెచ్చించడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.