బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడిగా, టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ రామాయణ చిత్రం సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

సంగీత విభాగంలో ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్ స్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ ఈ రామాయణ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 50 వేల స్క్రీన్‌లలో విడుదల చేసేలా సోనీ పిక్చర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ విడుదల కాగా, తాజాగా దసరా కానుకగా మరో కొత్త ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

కొత్త ట్రైలర్‌లో చూపించిన మైండ్ బ్లోయింగ్ విజువల్స్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి విజువల్స్ ఇండియన్ సినిమా తెరపై ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదనేలా ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రైలర్‌ను చాలా షార్ప్‌గా, వేగవంతంగా కట్ చేసిన విధానం కూడా ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది.

యుగయుగాలుగా దేవాసురుల మధ్య సాగిన యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. పుడమి అంతటా శాంతి నెలకొంది. దీనస్థితిలో ఉన్న అసురుల కోసం ఎగిసినది ఒక జ్వాల. అష్టదిక్కులా మారు మ్రోగినది ఆ అసురుని నామం. రావణ.. అతని అరాచకానికి ముల్లోకాలు అతని పాదాక్రాంతం అయ్యాయి.

ఈ వర్ణనతో ప్రారంభమయ్యే తాజా ట్రైలర్‌లో రావణుడి పాత్రను శక్తివంతంగా ఆవిష్కరించడంతో పాటు, రామాయణ గాథను విస్తృతమైన విజువల్ స్కేల్‌లో చూపించబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.