రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రనబాలి’కి అనుబంధంగా ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘రనబాలి: నెవర్ ఫర్‌గెట్’ పేరుతో రూపొందించిన ఈ నాలుగు ఎపిసోడ్‌ల డాక్యుమెంటరీ, చిత్రానికి పునాదిగా ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ప్రేక్షకులకు మరింత స్పష్టంగా పరిచయం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సిరీస్‌కు సంబంధించిన పరిశోధనను చిత్రబృందం గత రెండేళ్లుగా కొనసాగించింది. దాదాపు 150 ఏళ్లుగా పెద్దగా చర్చకు రాని ఒక విస్తృత చారిత్రక కాలాన్ని ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం చేసినట్లు సమాచారం. ఆ పరిశోధన ఫలితాలను, ‘రనబాలి’లో చూపించిన ప్రపంచానికి నేపథ్యంగా ఉన్న సంఘటనలను, ఈ డాక్యుమెంటరీ ద్వారా సులభంగా అర్థమయ్యేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నాలుగు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్‌లోని ఎపిసోడ్‌లకు ‘ది ఫ్యామిన్ వి ఫర్‌గాట్’, ‘ది హిస్టరీ వి ఫర్‌గాట్’, ‘ది మెన్ వి ఫర్‌గాట్’, ‘ది లాస్ట్ లోడ్’ అనే శీర్షికలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 28, 2026న మైత్రి మూవీ మేకర్స్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదల కానుంది. తరువాతి భాగాలు కూడా అదే వేదికల ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

‘రనబాలి’ కథా నేపథ్యం 1876–78 మధ్య జరిగిన మహా కరువు కాలం చుట్టూ తిరుగుతుంది. ఈ కరువు ‘ మద్రాస్ ఫెమిని ’ పేరుతో చరిత్రలో నమోదైంది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ తో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని విస్తృత ప్రాంతాలను ఈ కరువు ప్రభావితం చేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విపత్తుకు సంబంధించిన ఖచ్చితమైన మరణాల సంఖ్యపై ఇప్పటికీ చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కారణం, అప్పటి రికార్డులలో ఉన్న లోపాలు, వివిధ అంచనాల్లో పరిగణనలోకి తీసుకున్న భౌగోళిక ప్రాంతాల వ్యత్యాసాలు.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవేరుకోండ ‘రనబాలి’గా, రష్మిక మందన్న ‘జయమ్మ’గా నటిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన యోధుడిగా విజయ్ పాత్రను చిత్రీకరించారు. తన ప్రాంత ప్రజలు కరువు, దోపిడీతో అల్లాడుతున్న పరిస్థితిని చూసి, వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వ్యక్తిగా అతని పాత్రను చూపిస్తున్నారు. రష్మిక పోషిస్తున్న జయమ్మ, రనబాలి భార్యగా, అతని పోరాటానికి తోడుగా నిలిచే సహచరిగా చిత్రంలో కనిపించనుంది.

అదే సమయంలో ఆర్నాల్డ్ వోస్లూ , సర్ థియోడార్ హెక్టర్ అనే బ్రిటిష్ వలస అధికారిగా నటిస్తున్నారు. రనబాలి ఎదిరించే వలస వ్యవస్థకు ప్రతీకగా ఈ పాత్రను చిత్రంలో చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో, డాక్యుమెంటరీ సిరీస్ సినిమా ప్రపంచానికి చారిత్రక సహచరంగా పనిచేసేలా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. కరువు, ఆ కాలం చుట్టూ ఉన్న మరచిపోయిన చరిత్ర, ప్రతిఘటించిన వ్యక్తులు, ఆ కాలం సంఘటనలు – ఇవన్నింటినీ విస్తృతంగా వివరించి, ‘రనబాలి’ కథా ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన అంశాలను ఈ సిరీస్‌లో ఆవిష్కరించనున్నారు.

‘రనబాలి’ చిత్రం అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా కథా నేపథ్యంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.








