సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ‘రావు బహదూర్’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. మహేష్ బాబుతో కలిసి ‘క’ వంటి విభిన్నమైన చిత్రం తీసిన చింత గోపాలకృష్ణ, ‘మేజర్’ వంటి కల్ట్ సినిమాను నిర్మించిన అనురాగ్, శరత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘రావు బహదూర్’ ట్రైలర్ 1 నిమిషం 39 సెకన్ల నిడివి కలిగి ఉంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన చెప్పిన మాటలతోనే ఈ చిత్ర ప్రపంచంపై ఒక హింట్ ఇచ్చినట్టైంది.

“వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అని అంటుంటారు. కానీ నా మాటగా చెప్పాలంటే వెన్ డ్రామా మీట్స్ మేజిక్, లాజిక్ గేట్స్ ఎ న్యూ మీనింగ్”

ఈ డైలాగ్‌తో ‘రావు బహదూర్’లో డ్రామా, మేజిక్, లాజిక్‌ల మేళవింపును సూచించినట్టుగా కనిపిస్తోంది. ఆ తరువాత మహేష్ బాబు ఈ చిత్రంలోని మిస్టరీ, మేజిక్‌లను మరింత వివరించారు.

“ఒక అనుమానం సంవత్సరం క్రితం చావాల్సిన వాడిని ప్రాణాలతో ఉండేలా చేసింది. ఆ అనుమానమే పురుగై వాడి ప్రపంచాన్ని గింగిరాలు తిప్పించగలదు. ఇక్కడ మేజిక్ అంటే గారడీ కాదు ఒక దృశ్య కావ్యం”

సంవత్సరం క్రితం చావాల్సిన వ్యక్తి అనుమానం వల్ల బ్రతికుండటం, ఆ అనుమానం అతని జీవితాన్ని, ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందన్న అంశాల చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి చేష్టలు, అతని చుట్టూ జరిగే సంఘటనల్లో చాలా మిస్టరీ దాగి ఉందని విజువల్స్ ద్వారా సూచించారు.

ట్రైలర్‌లో చూపించిన ఫ్రేములు, కలర్ టోన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ చూస్తే విజువల్స్ రిచ్‌గా, కథనం స్టైలిష్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. దర్శకుడు వెంకటేష్ మహా ఎంతో ప్యాషన్‌తో ‘రావు బహదూర్’ను తీర్చిదిద్దుతున్నాడని ట్రైలర్‌ మేకింగ్‌ నుంచే స్పష్టమవుతోంది. సస్పెన్స్, థ్రిల్‌లతో నిండిన అనుభవాన్ని ఈ చిత్రం అందించబోతుందనే భావన ట్రైలర్‌ చూసిన వారికి కలుగుతోంది.

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు “GMB Entertainment ప్రౌడ్లీ ప్రెజెంట్స్” అని కాన్ఫిడెంట్‌గా పలకడం, ఈ చిత్రంపై ఉన్న నమ్మకాన్ని, హైప్‌ను మరింత పెంచే అంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సినీప్రియుల్లో పెరుగుతోంది.