రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సినీ నటి రష్మిక మందన్న గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’. కథానాయిక ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘మైసా’కు సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు, అండర్ వాటర్ సీక్వెన్స్‌ను ఇటీవల పూర్తి చేశారు. తాజాగా ఓ పాటను షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోఐపు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ‘రణబాలి’లో నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌ను వెంటాడుతున్న గాయాలు
ఈ ఏడాది తెలుగు సినీ నటులు వరుసగా గాయాల పాలవుతున్నారు. ఇటీవల అగ్ర కథానాయకుడు బాలకృష్ణ #NBK111 షూటింగ్‌లో గాయపడగా, ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారు. మరోవైపు అబ్బాయి ఎన్టీఆర్ భుజానికి కూడా గాయమైంది. ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైౖద్య బృందం సూచించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చేస్తున్నారు. ‘పెద్ది’ షూటింగ్‌లో రామ్‌చరణ్ మణికట్టుకు గాయమవగా, ఇటీవల కోయంబతూర్తు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిరంజీవి కూడా చేతికి బెల్ట్‌తో కనిపించారు. గత కొంతకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
విడుదల మరింత ఆలస్యం..
ఒక కథానాయకుడు/నాయిక గాయపడటం వాళ్లు పనిచేస్తున్న సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రష్మిక ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నారు. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. సెప్టెంబరు 11న ‘రణబాలి’ విడుదల తేదీని ప్రకటించారు. మరి ఆమెకు సంబంధించిన షూట్ పూర్తయిందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. బాలకృష్ణ #NBK111 విడుదల కూడా ఆలస్యం కానుంది. చరణ్ కూడా పూర్తిగా కోలుకున్న తర్వాతే సుకుమార్ మూవీ సెట్స్‌లో అడుగు పెట్టనున్నారు.







