రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రష్మిక‘మైసా’ టీజర్ రిలీజ్
గ్లామరస్ పాత్రలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇప్పటి వరకు కుర్రకారును ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తొలిసారిగా పూర్తిగా భిన్నమైన రౌద్ర రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం విడుదల చేసిన ‘మైసా’ టీజర్‌కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది.

టీజర్ మొత్తం గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిండి ఉంది. ఇందులో రష్మిక అత్యంత శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖమంతా రక్తపు మరకలు, చేతిలో ఆయుధాలు పట్టుకుని శత్రువులపై విరుచుకుపడుతున్న ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

యుద్ధం, ఆయుధాల నేపథ్యంతో వచ్చే డైలాగ్స్ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేచురల్ లుక్‌తో పాటు కళ్లలోనే పగ, ఆవేశం నింపుకుని రష్మిక చూపించిన హావభావాలు ఆమె నటనకు కొత్త మైలురాయిగా నిలుస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
క్లైమాక్స్ స్థాయి యాక్షన్ మూమెంట్స్‌ను గుర్తు చేసేలా కట్ చేసిన ఈ టీజర్ మొత్తం హై వోల్టేజ్ వైబ్‌ను సృష్టించింది. ప్రతి షాట్‌లోనూ తీవ్రతను పెంచేలా మాంటేజ్‌లు, యాక్షన్ బ్లాక్స్‌ను అమర్చిన విధానం ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా రేకెత్తిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సమకూర్చిన నేపథ్య సంగీతం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి షాట్‌ను ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గిరిజన సంస్కృతి, వారి జీవన విధానం, పోరాటాల నేపథ్యంలో ‘మైసా’ రూపొందుతున్నట్లు టీజర్ నుంచి స్పష్టమవుతోంది. కమర్షియల్ హంగులతో పాటు బలమైన కథనంతో వస్తున్న ఈ సినిమా రష్మిక కెరీర్‌లో ఓ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ‘మైసా’ టీజర్ యూట్యూబ్‌తో పాటు వివిధ సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక కొత్త అవతారంపై అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.







