మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో సెంటిమెంట్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకులకు, గతంలో తనతో కలిసిరాని హీరోయిన్‌లకు కూడా తిరిగి అవకాశాలు ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయరు. అదే సమయంలో, తనతో విజయాలు సాధించిన ఫామ్‌లో ఉన్న దర్శకులతో కొత్త ప్రాజెక్టులు చేయడానికీ రవితేజ ముందుంటారు. ప్లాప్స్ ఎదురైనా వరుస సినిమాలతో దూసుకెళ్లడం ఆయనకు సహజం.

అయితే, రవితేజ కెరీర్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో లేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం తర్వాత ఆయన ఖాతాలో ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా బలమైన కంబ్యాక్ ఇవ్వాలని రవితేజ లక్ష్యంగా పెట్టుకున్నారని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీ–కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథాంశంతో మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ–పాప సెంటిమెంట్ ఎంత బలంగా వర్కవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ భావోద్వేగ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, చాలా కాలం తర్వాత ‘ఇరుముడి’ ద్వారా బలమైన తండ్రీ–కూతుళ్ల ఎమోషన్‌తో రవితేజ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈసారి చిత్రంలో చూపిస్తున్న చైల్డ్ సెంటిమెంట్ మాస్ మహారాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్‌ను అందిస్తుందో లేదో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ నటి ప్రియా భవాని శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని జీవి ప్రకాష్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మాస్, ఎమోషన్‌ల మేళవింపుతో వస్తున్న ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో కీలక మలుపుగా నిలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.