సీమ రమ్మంది... స్టోరీ ఉందంది

రాయలసీమ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో ఇప్పటికే అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సీమను నేపథ్యంగా చేసుకుని ఇంకా ఎన్నో కథలు చెప్పొచ్చని భావిస్తున్న రచయితలు, దర్శకులు ప్రస్తుతం పలు చిత్రాలను రూపొందిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న, విడుదలకు సిద్ధమైన రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వచ్చే సంక్రాంతికి నవ్వుల కోలాటం అందించేందుకు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా ఒక ఎంటర్‌టైనింగ్‌ సినిమా రూపొందుతోంది. ‘వెంకీఅనిల్‌5 అండ్‌ ఎన్‌కేఆర్‌ఏఆర్‌2’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నేడు ప్రారంభం కానుంది. ‘కత్తిలాంటి ఐడియా’ పేరుతో ఆదివారం విడుదల చేసిన వినోదాత్మక కాన్సెప్ట్‌ వీడియో ద్వారా ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా అని బృందం స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ‘జనవరి 13న రిలీజ్, బామ్మర్ది బాల్‌రెడ్డి’ వంటి టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే సమాచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. జీ స్టూడియోస్, సురేష్‌ ప్రోడక్షన్స్, అర్చనల సమర్పణలో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న చిత్రం ‘లెనిన్‌’. తన ప్రేమ కోసం లెనిన్‌ ఎంత దూరం వెళ్తాడో ఈ క్యాప్షన్‌ సూచిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, కుటుంబం, రాజకీయ అంశాలతో రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. కథలో ప్రేమ ప్రధానాంశమని ఇటీవల విడుదలైన ‘సోల్‌ ఆఫ్‌ లెనిన్‌’ వీడియో ద్వారా వెల్లడైంది. లెనిన్‌ పాత్రలో అక్కినేని అఖిల్‌ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటివరకు తన సినిమాల్లో కనిపించని మాస్‌ లుక్‌లో అఖిల్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. రాయలసీమ కుర్రాడి పాత్రకు న్యాయం చేయడానికి చిత్తూరు యాసలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న అఖిల్‌ తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పారు. జూలై 10న ‘లెనిన్‌’ విడుదల కానుంది.

రాయలసీమ చరిత్రలోని పోరాటాలను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘రణబాలి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 19వ శతాబ్దం, ముఖ్యంగా 1854–1878 మధ్యకాలంలో బ్రిటిష్‌ పాలనలో కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సమయంలో ప్రజల్లోంచి ముందుకు వచ్చిన ఓ యువ యోధుడు బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేయడం ఈ చిత్రానికి మూలకథ. రణబాలి పాత్రలో విజయ్‌ దేవరకొండ, అతనికి జోడీగా జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం నాటి రాయలసీమ యాసలో శిక్షణతో పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న విడుదల కానుంది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా, రితికా నాయక్‌ కథానాయికగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొరియన్‌ కనకరాజు’ కూడా రాయలసీమ నేపథ్యంలోనే సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం ప్రాంతం ఈ చిత్రానికి బ్యాక్‌డ్రాప్‌గా ఉంటుంది. కనకరాజు అనే పాత్రలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నారు. ఓ కొరియన్‌ దెయ్యం, కనకరాజు మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది కథలో ఆసక్తికరంగా మలిచినట్లు చిత్రబృందం తెలిపింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాసా మంగాపురం’. రవీనాటాండన్‌ కుమార్తె రాషా తడానీ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తిరుపతికి సమీపంలోని గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగే విలేజ్‌ లవ్‌ స్టోరీ. శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగా పాత్రలో రాషా నటించారు. సి. అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 9న విడుదల చేయాలని నిర్ణయించారు.

అలాగే సాయిదుర్గా తేజ్‌ హీరోగా రోహిత్‌ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’తో పాటు రాయలసీమ నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. రాయలసీమ మట్టి, మనుషులు, వారి భావోద్వేగాలు, పోరాటాలు ఈ సినిమాల ద్వారా మరోసారి తెరపైకి రానున్నాయి.