రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
భారత సినీ పరిశ్రమకు తీరని లోటు… లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
భారత సినీ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. విలక్షణమైన కథాంశాలతో, ప్రయోగాత్మక చిత్రాలు తీసి దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ దర్శకుడు, నటుడు, రచయిత సింగీతం శ్రీనివాస రావు శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, అక్కడే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
1931 సెప్టెంబర్ 21న మద్రాస్ ప్రెసిడెన్సీ లోని ఉదయగిరి లో జన్మించిన సింగీతం శ్రీనివాస రావు , తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు అరవై చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా మాత్రమే కాక, కథా రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ రంగంలో వినూత్నతకు ప్రతీకగా నిలిచారు.
తెలుగు ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాస రావు పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే చిత్రాలు ‘ భైరవ ద్వీపం ’, ‘ ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ రెండు చిత్రాలు అప్పట్లో కొత్త ధోరణి సృష్టించాయి. ముఖ్యంగా టైం ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ ఆదిత్య 369’ తెలుగు తెరపై వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా చరిత్రలో నిలిచింది. ఈ చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లు సాధించడం, కొత్త తరం ప్రేక్షకులకూ ఆయన పనితనాన్ని పరిచయం చేసింది.
మాటలేమీ లేకుండా పూర్తిగా మౌన చిత్రంగా రూపొందించిన ‘ పుష్పక విమానం ’తో సింగీతం శ్రీనివాస రావు మరో ప్రయోగానికి తెరతీశారు. సంభాషణలు లేకుండానే ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ‘ విచిత్ర సోదరులు ’, ‘ మైఖేల్ మదన కామరాజు ’ వంటి చిత్రాలతోనూ ఆయన వినోదాన్ని, ప్రయోగాత్మకతను సమన్వయం చేసే తన ప్రత్యేక శైలిని చూపించారు.
అంతేకాక, వయసు 90 దాటిన తర్వాత కూడా ఆయన సృజనాత్మకత తగ్గలేదు. 94 ఏళ్ల వయసులో కూడా ‘ సింగ్ గీతం ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా తన పనితీరును మరోసారి నిరూపించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం 2026లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సింగీతం శ్రీనివాస రావు అనేక పురస్కారాలు అందుకున్నారు. రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ , ఐదు నంది అవార్డ్స్ , మూడు కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్స్ , మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఆయన ఖాతాలో ఉన్నాయి. 2011లో ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ , కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్స్ , ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వంటి వేదికల నుంచి కూడా ఆయనకు గౌరవాలు లభించాయి.
ఈ విధంగా అనేక భాషల్లో, విభిన్న శైలుల్లో చిరస్మరణీయ చిత్రాలు అందించిన సింగీతం శ్రీనివాస రావు మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన సృష్టించిన చిత్రాలు, చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఉన్నాయి.







