పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్‌

వనపర్తి జిల్లాలో ఉచిత అంబులెన్స్‌, హైదరాబాద్‌లో ఆటోల పంపిణీ

దేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. వనపర్తి జిల్లాలో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించడంతో పాటు, హైదరాబాద్‌లో నిరుపేద ఆటో కార్మికులకు ఆటోలను బహూకరించారు.

వనపర్తి జిల్లాలో మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఈ అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందేలా ఈ సేవలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను సోనూసూద్ అందజేశారు. ఈ ఆటోల ద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సేవా కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరణోదయ సొసైటీ ఫౌండర్‌ కొండ కృష్ణమ్మకు సోనూసూద్ అభినందనలు తెలిపారు. అంబులెన్స్‌ను స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాల ప్రజలు ఈ అంబులెన్స్ సేవలను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.

జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలను అందించడం ద్వారా వారి కుటుంబాలను నిలబెట్టడంలో మాల్యవి కరణోదయ సొసైటీ కీలక పాత్ర పోషిస్తున్నదని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కుటుంబాలకు అండగా నిలవాలని ఆటో కార్మికులకు హితవు చెప్పారు. మాల్యవి కరణోదయ సొసైటీని ఫౌండర్‌ కొండ కృష్ణమ్మ 2004లో హైదరాబాద్‌లో స్థాపించారు. గత 22 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాంధీ, నీలోఫర్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణాల్లో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. అనేక నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను సొసైటీ అందించింది.

కరోనా సమయంలో కూడా సొసైటీ సేవలను ఆపకుండా మరింత విస్తృతంగా కొనసాగించింది. మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుట్టుమిషన్లను బహూకరించింది. సమాజంపై ప్రేమ, బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సొసైటీ చెబుతోంది.