హైదరాబాద్‌: తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఒకేసారి అవకాశాలు అందిపుచ్చుకున్న హీరోయిన్‌ శ్రీలీల కెరీర్‌ ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకున్న ఆమె పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో చేయాల్సిన తొలి సినిమా ఆలస్యమవుతుండటంతో ఆమె భవిష్యత్‌ మరింత అనిశ్చితిలోకి వెళ్లిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆమె నటించిన ఉస్తాద్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో టాలీవుడ్ మేకర్స్‌ ఆమెను పక్కన పెట్టినట్టే అయ్యారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆమె పేరే మర్చిపోయిన పరిస్థితి ఏర్పడిందని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ నేపథ్యంలో శ్రీలీల తమిళంలోకి అడుగుపెట్టింది. పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ సరసన నటించింది. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ ఆమెకు మరో తమిళ అవకాశం దక్కింది. ఓం చాప్టర్ 1లో ధనుష్తో జతకట్టనుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో, ఇందులో శ్రీలీల పాత్ర ఎంత ప్రాధాన్యం సంతరించుకుంటుందో ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా, శ్రీలీల కెరీర్‌ హైప్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న హిందీ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఈ జంటపై ఎఫైర్‌ రూమర్స్‌ చక్కర్లు కొట్టినా, మూడు సంవత్సరాలు గడిచినా సినిమా మాత్రం పూర్తికాలేదు. శ్రీలీల భాగానికి సంబంధించిన షూటింగ్ ముగిసినప్పటికీ, రీషూట్స్ కోసం ఆమె డేట్స్ కోరుతున్నారని సమాచారం.

శ్రీలీల తొలి హిందీ సినిమా కథ, హిట్‌ మూవీ సయారా కథకు దగ్గరగా ఉందనే విమర్శలు రావడంతో, కథలో మార్పులు చేసినట్టు, అందుకే రీషూట్‌లు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆమె బాలీవుడ్‌ డెబ్యూ పూర్తిగా డైలమాలో పడింది.

మూడేళ్లుగా పూర్తి కాకుండా ఉన్న ఈ లవ్ స్టోరీ థియేటర్లలోకి వచ్చి హిట్‌ అయితే గానీ, శ్రీలీలకు మరో హిందీ ఆఫర్‌ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు ఆమెకు తమిళంలో ఉన్న ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకూ శ్రీలీల పేరు వినగానే డ్యాన్స్‌ నంబర్లే గుర్తొస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన పాత్రల్లో నటనకు పెద్దగా స్కోప్‌ లేకపోవడం, కెరీర్‌కు మేలు చేసే చిత్రాలు లేకపోవడం ఆమెకు మైనస్‌గా మారిందనే అభిప్రాయం ఉంది.

శ్రీలీల కెరీర్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్స్‌ అంటే పెళ్లి సందడి, ధమాకా మాత్రమే. కథ, పాత్ర ప్రాధాన్యం గురించి పెద్దగా ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేస్తూ రావడంతో ఆమెపై ‘ఐరన్ లెగ్’ ముద్ర పడిందని సినీ వర్గాల్లో చర్చ. ఇకనైనా స్క్రిప్ట్‌, క్యారెక్టర్‌ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇండస్ట్రీ నుంచి నెమ్మదిగా కనుమరుగైపోవడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.