బాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘గాంధారి’ (Gandhari)పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్, పురాణ స్ఫూర్తి కలగలిపిన ఈ కథలో తాప్సీ కళ్లకు గంతలు కట్టుకుని చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి.

మహాభారతంలోని గాంధారి పాత్ర భారతీయ ఇతిహాసాల్లో అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకటిగా భావిస్తారు. అంధుడైన భర్త ధృతరాష్ట్రుడి జీవితాన్ని పంచుకోవాలనే సంకల్పంతో ఆమె స్వయంగా కళ్లకు గంతలు కట్టుకోవడం త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే గాంధారి పాత్రను ఆధునిక కోణంలో, సమకాలీన నేపథ్యంలో చూపించేందుకు దర్శకుడు దేవాశిష్ మఖిజా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాప్సీ పోషిస్తున్న ఈ పాత్రలో త్యాగం, ఆవేదన, ఆగ్రహం, ప్రతీకారం వంటి భావోద్వేగాలు మేళవించి ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

థియేటర్లకు వెళ్లకుండానే ‘గాంధారి’ నేరుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రం Netflix ప్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా విడుదల కానుంది. ప్రముఖ రచయిత్రి కనికా థిల్లాన్ కథ అందించి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని గాంధారి పాత్ర స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో తాప్సీ ఎక్కడా డూప్ వాడకుండా, కళ్లకు గంతలు కట్టుకుని పోరాడే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ విషయమై Netflix సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ తేదీని రాబోయే కొన్ని వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం 2026 చివరికల్లా నేరుగా ఆన్‌లైన్‌లో విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.

కథ విషయానికి వస్తే… ‘గాంధారి’ సినిమా కథ కిడ్నాప్ చేయబడిన తన కన్నబిడ్డను రక్షించుకోవడానికి ఒక సామాన్య తల్లి వ్యవస్థపై తిరుగుబాటు చేసే అత్యంత ఇంటెన్స్ రివెంజ్ డ్రామా. తన బిడ్డను తిరిగి దక్కించుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఆపదలు, శత్రువుల ఆటను ఆపేందుకు ఆమె చేసిన సాహసోపేత ప్రయత్నాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం తాప్సీ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే హిందీ చిత్రసీమలో లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో తన సత్తా చాటుతున్న తాప్సీకి ‘గాంధారి’ మరో కీలక మలుపుగా మారుతుందా అన్నది చూడాలి. తాప్సీ ఇంటెన్స్ యాక్షన్, భావోద్వేగాలతో నిండిన ఈ రివెంజ్ డ్రామాను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు మాత్రం Netflix అధికారిక ప్రకటన కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.