రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సాయిబాబా జీవితకథ ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక చిత్రం ‘తేరా సాయి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తేరా సాయి’గా పేరుపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సాయిబాబా పాత్రలో కనిపించనున్నారు.
పలాశ్ ముచ్చల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు చిత్రబృందం ముందుగా వెల్లడించింది. సంజయ్ మిశ్రాతో పాటు షాయాజీ షిండే, మనోజ్ జోషి, అవికా గోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇటీవల ‘హనుమాన్ అంశ్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినీపోలిస్ ఇండియా, ‘తేరా సాయి’ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చేపట్టింది. దేశీయంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విస్తృతంగా విడుదల చేయడానికి ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా గతంలోనూ పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 1986లో వచ్చిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఇళయరాజా అందించిన సంగీతం, బాబా భక్తి గీతాలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భక్తుల హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి.
అలాగే అగ్రకథానాయకుడు నాగార్జున బాబా పాత్రలో నటించిన ‘షిర్డీ సాయి’ 2012లో విడుదలై విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి కూడా భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ‘తేరా సాయి’ రూపంలో మరోసారి సాయిబాబా జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుండటంతో భక్తులు, సినీప్రేక్షుల్లో ఆసక్తి నెలకొంది.
సాయిబాబా బోధనలు, ఆయన సేవా కార్యక్రమాలు, శిర్డీ నేపథ్యంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నారన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బహుభాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం, భక్తి చిత్రాల శ్రేణిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందేమో చూడాలి.







