రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: పాన్ ఇండియా స్టార్, కన్నడ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ ప్రధాన నాయికగా నటిస్తోంది. అలాగే నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీతో పాటు పలువురు విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.
ఇప్పటికే విడుదలైన ‘టాక్సిక్’ టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే చిత్రం పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా, రక్తపాతం సన్నివేశాలతో నిండిన కథగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.
‘టాక్సిక్’ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 21 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. సినిమా చూసిన యూకే సెన్సార్ బోర్డు సభ్యులు తమ సమీక్షను వెల్లడించారు. ఈ చిత్రానికి 18+ (Adults Only) సర్టిఫికేట్‌ను కేటాయించారు. హింస, రక్తపాతం, శృంగార దృశ్యాలు ఉన్నాయని యూకే సెన్సార్ బోర్డు పేర్కొంది.
సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఒక స్థాయిలో ఉంటే, యష్ నటన మరో స్థాయిలో ఉందని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. అతను అద్భుతంగా నటించినట్లు బోర్డు సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం.
గోవాలో రౌడీ ముఠా సామ్రాజ్యాన్ని ఏలే శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ లీడర్, తన సొంత నాశనానికి తానే ఎలా బీజం వేస్తాడు అన్నదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ట్రైలర్‌లో కూడా ఈ కథా నేపథ్యం స్పష్టంగా చూపించారు. అయితే చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సూచించింది.
హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా కావడంతో యాక్షన్ సీన్స్, రక్తపాతం అంశాలకు 5/5 రేటింగ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే డైలాగ్స్, డ్రగ్స్ వినియోగం, లైంగిక హింస, శృంగారం వంటి కేటగిరీలకు 4/5 రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘టాక్సిక్’ రన్‌టైమ్ విషయానికి వస్తే, మొత్తం 192 నిమిషాలుగా (3 గంటలు 12 నిమిషాలు) ఫిక్స్ చేస్తూ యూకే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో దీర్ఘకాలం నడిచే యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.







