రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ చిత్రం D56 పూజా కార్యక్రమాలు మధురైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన దీర్ఘ సినీ ప్రయాణంలో ధనుష్‌తో కలిసి నటించే అవకాశం వడివేలుకు ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ అరుదైన కాంబినేషన్ ఇప్పటివరకు ఎందుకు జరగలేదన్న ప్రశ్నకు వడివేలు స్వయంగా సమాధానం చెబుతూ కీలక విషయాన్ని బయటపెట్టారు. ధనుష్‌తో తన మధ్య ఏర్పడిన విరోధానికి మూడో వ్యక్తి కారణమని ఆయన స్పష్టం చేశారు.
“చాలా సుదీర్ఘ విరామం తర్వాత ధనుష్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. మా ఇద్దరి కలయికకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరంతా అడగొచ్చు. దానికి కారణం ఒక మూడో వ్యక్తి. ఆ వ్యక్తి సృష్టించిన అపోహల వల్లే మా మధ్య ఇన్నాళ్లూ గొడవలు జరిగాయి”
వడివేలు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆ మూడో వ్యక్తి ఎవరన్నది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వడివేలు ఆ వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు.
మధురైలోని మారనాడు కరుప్పన్నస్వామి ఆలయంలో అభిమానుల సందడి మధ్య D56 పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధనుష్ ఏకంగా 18 అడుగుల భారీ కొడవలిని స్వామివారికి సమర్పించడం అక్కడి భక్తులు, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆలయ ప్రాంగణంలో ఈ విశేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పక్కా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాయన్’ తర్వాత మరోసారి SJ Surya ఇందులో కీలక పాత్రలో కనిపించనుండగా, ప్రీతి ముకుందన్, విజయ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత బిజీ నటుల్లో ధనుష్ ముందువరుసలో ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్టర్ 1’ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
మూల ప్రణాళిక ప్రకారం ‘ఓం: చాప్టర్ 1’ అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, హీరో సూర్య దీపావళి రిలీజ్ ‘సీన్’ చిత్రాలకు పోటీ ఇవ్వకుండా ఉండేందుకు ధనుష్ తన సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.







