రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 తెలుగు ఈ చిత్రాన్ని ఆగస్టులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే సినిమా స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని త్వరలో వెల్లడించనున్నారు.
ఇటీవల ‘పరిమళ & కో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ZEE5 తెలుగు, ఇప్పుడు మరో హృద్యమైన కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వంద దేవుళ్లు’ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓ తల్లి, ఆమె ఇద్దరు కొడుకుల చుట్టూ తిరుగుతుంది. నలభై ఏళ్లు దాటిన ఓ తల్లి తన జీవితంలో మరోసారి తోడు కోసం ఆలోచించిన సమయంలో ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, సమాజం నుంచి వచ్చే విమర్శలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
తల్లి జీవితంలోని త్యాగాలను గుర్తించిన కొడుకు, ఆమె సంతోషం కోసం సమాజాన్ని ఎదుర్కొనే కథాంశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తల్లీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించిన ఈ చిత్రం వివాహం, మాతృత్వం, మహిళల స్వతంత్ర నిర్ణయాలు వంటి అంశాలను స్పృశిస్తుంది.
థియేటర్లలో విడుదలైన సమయంలోనే ‘వంద దేవుళ్లు’కు మంచి స్పందన లభించింది. చిత్రంలో చూపించిన సహజమైన భావోద్వేగాలు, నటీనటుల అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఈ చిత్రం అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ZEE5 మార్కెటింగ్ సౌత్, తమిళ & మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి జేవియర్ మాట్లాడుతూ, ‘పరిమళ & కో’కు వచ్చిన స్పందన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌పై ప్రేక్షకుల ఆసక్తిని మరోసారి నిరూపించిందని తెలిపారు. ‘వంద దేవుళ్లు’తో అదే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని, మంచి కథలను అన్ని భాషల ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
‘వంద దేవుళ్లు’ ఈ ఆగస్టులో ప్రత్యేకంగా ZEE5లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఖచ్చితమైన విడుదల తేదీని ZEE5 త్వరలో ప్రకటించనుంది.







