టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాలే చేసినా విపరీతమైన అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి, తర్వాత హీరోగా మారి వరుస విజయాలతో స్టార్‌డమ్‌ సాధించాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల తర్వాత ఒక్క రాత్రిలోనే స్టార్‌గా మారిన విజయ్, తరువాత కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవేరుకోండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే రష్మిక మందన్నాను వివాహం చేసుకున్న విజయ్, పెళ్లి తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. అచ్చం పేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు తన ట్రస్ట్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందించడం వంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నాడు.

తన అభిమానుల కోరికలను కూడా సాధ్యమైనంత వరకు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటాడు ఈ స్టార్ హీరో. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉప్పల్ స్టేడియంలో జరిగిన TG20 League ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్‌ను స్టేడియంలో చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ క్రమంలో ఒక అభిమాని అతన్ని దగ్గరగా చూసిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యాడు.

విజయ్‌ను సమీపంలో చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని భావోద్వేగాన్ని గమనించిన విజయ్, అతన్ని తన దగ్గరకు పిలిచాడు. విజయ్‌ను ఎదురెదురుగా చూసిన ఆ అభిమాని భోరున ఏడవడం ప్రారంభించాడు. తాను క్రికెట్ బాగా ఆడతానని, కానీ సరైన ప్రోత్సాహం, మద్దతు లభించడం లేదని విజయ్‌కు చెప్పాడు. నువ్వే కొంత ఆదుకోవాలని, తోడుగా నిలవాలని అభ్యర్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆ యువకుడి పరిస్థితి చూసి విజయ్ దేవరకొండ చలించిపోయాడు. అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాడు. అంతేకాక అతని కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాడు. తనవంతు మద్దతు ఉంటుందని ఆ అభిమానికి భరోసా ఇచ్చినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు.

ఒక అభిమాని కోసం అంత సమయం కేటాయించి, అతని మాటలను పూర్తిగా విన్న విజయ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టేడియంలో చోటుచేసుకున్న ఈ హృదయాన్ని హత్తుకునే సంఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు విస్తృతంగా పంచుకుంటున్నారు. #VijayDevarakonda, #TG20 వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆ వీడియో వైరల్‌గా మారింది.